సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండా, ఫీజులు ఎగ్గొడుతున్న వ్యాపారస్తులపై బల్దియా స్పెషల్ డ్రైవ్‌కు సిద్ధమైంది. నగరవ్యాప్తంగా లక్షల్లో వ్యాపారాలు కొనసాగుతుంటే ట్రేడ్ లైసెన్స్‌లు మాత్రం పెరగడం లేదు. ఈ నేపథ్యంలోనే లైసెన్స్‌లు లేకుండా వ్యాపారస్తులు, ఫీజులు చెల్లించని వారిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆదాయం పెంచుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఒక్కో సర్కిల్‌కు 20 ప్రత్యేక బృందాలను నియమించారు.
వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి, ట్రేడ్ లైసెన్స్ ఉందా? లేదా? చెక్ చేయనున్నారు. లైసెన్స్ లేకపోతే పెనాల్టీతో పాటు ఫీజులూ వసూలు చేయనున్నారు. ట్రేడ్ లైసెన్స్‌లు రెన్యువల్ చేసుకోని వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటి వరకు 1.60 లక్షల మంది రెన్యువల్ ఫీజు చెల్లించలేదు. దీంతో స్పెషల్ డ్రైవ్ ద్వారా దాదాపు రూ. 505 కోట్ల మేర వీరి నుంచి ఆదాయం వస్తుందని అధికారులు అంచనాతో ఉన్నారు.