సిటీబ్యూరో, జూన్ 29(నమస్తే తెలంగాణ): నగరంలోని మధురానగర్ మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఎల్లారెడ్డిగూడలోని పార్కుస్థలంలో ఆక్రమణలను ఆదివారం హైడ్రా సిబ్బంది తొలగించారు. సాయిసారథినగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో చేసిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. 1961లో ఐదెకరాల విస్తీర్ణంలో సాయిసారథినగర్ పేరిట 35 ప్లాట్లతో లేఔట్ ఏర్పాటైందని, ఇందులో 1,533 గజాల స్థలాన్ని పార్కుగా చూపించినట్లుగా నిర్ధారించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.
పార్కుస్థలంలో షెడ్డు వేసి ఖాళీ చేయకుండా ఆక్రమణలో ఉన్నట్లు స్థానికులు ఫిర్యాదు చేయడంతో కాలనీ వాసులు హైడ్రాను ఆశ్రయించారు. దీంతో క్షేత్రస్థాయిలో వివిధశాఖలతో కలిసి పూర్తిస్థాయిలో విచారణ జరిపిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆక్రమణలను తొలగించాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఈ మేరకు హైడ్రా సిబ్బంది షెడ్డును తొలగించి పార్కులో ప్రొటెక్టెడ్బై హైడ్రా బోర్డు పెట్టారు.