మన్సురాబాద్, మార్చి 1 : మన్సూరాబాద్ డివిజన్ సహారా స్టేట్స్ కాలనీ మొదటి గేటు సమీపంలోని ప్రధాన రహదారి పై ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. సహారా మొదటి గేట్ నుంచి రెండో గేటు వరకు వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్లు, ఫుట్ పాత్ లు ఆక్రమించి వెలసిన అక్రమ నిర్మాణాలతో ఈ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుకు జోనల్ కమిషనర్ స్పందించారు.
జోనల్ కమిషనర్ ఆదేశాలతో శనివారం ఉదయం రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సహారా మొదటి గేట్ నుంచి రెండో గేటు వరకు రోడ్డుకు ఇరువైపులా వెలసిన సుమారు 30 ఆక్రమణలను రెండు జేసీబీలతో తొలగించారు. ఇష్టానుసారంగా రోడ్లు, ఫుట్పాత్లు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు. ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించిన ప్రదేశంలో తిరిగి ఎవరైనా డబ్బాలు ఏర్పాటు చేసిన ఎలాంటి నిర్మాణాలు జరిపిన జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
అడ్డగుట్ట, మార్చి 1: ‘రోడ్డుమీద పండ్లను అమ్ముకుంటూ జీవితాలను సాగిస్తున్నాం… మా వ్యాపారాలను తీసేసి మా బతుకులను రోడ్డుపాలు చేయడం సరికాదు’ అని లాలాగూడ చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా వ్యాపారాలను నిర్వహించుకునే అవకాశం లేకుండా పోవడంతో శనివారం లాలాగూడ చిరు వ్యాపారులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి గోడును వెల్లబోసుకున్నారు. 20 ఏండ్లుగా సుమారు 100 కుటుంబాలు పండ్ల వ్యాపారాలను నిర్వహించుకుంటూ బతుకులను వెల్లదీస్తున్నారని, ఉన్నట్టుండి ట్రాఫిక్ పోలీసులు వ్యాపారాలను నిర్వహించుకోకుండా బండ్లను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగు నెలలుగా వ్యాపారాలు లేకపోవడంతో ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయన్నారు. తాము వ్యాపారాలను నిర్వహించుకునే విషయం లో రైల్వే అధికారులకు ఎలాంటి అభ్యంతరం లేదని, ట్రాఫిక్ పోలీసులు వ్యాపారాలను తొలగించాలని తీవ్రస్థాయిలో తమపై ఒత్తిడి చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. కార్యక్రమంలో స్ట్రీట్ వెండర్స్ మహమ్మద్ నిజాముద్దీన్, సయ్యద్ సమీర్, రాజు, తాజ్, గౌస్, అబ్దుల్ మజీద్ తదితరులు పాల్గొన్నారు.