దుండిగల్, డిసెంబర్ 28: నిజాంపేటలోని ప్రభుత్వ భూముల్లో వెలసిన పలు నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు. ‘జాగా కనిపిస్తే.. పాగా’ పేరిట ‘నమస్తే’లోప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. అయితే నామమాత్రంగా కూల్చివేతలు చేపట్టి.. మమ అనిపించారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఓ బడా బిల్డర్ ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల జోలికి అధికారులు అసలే పోలేదనే ఆరోపణలున్నాయి.
కానీ కొందరు పేదలకు సంబంధించిన నిర్మాణాలను మాత్రం నేలమట్టం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడా బిల్డర్ వెనుక ఓ నాయకుడు ఉండి కథ నడిపిస్తుండటంతోనే అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదని పలువురు పేర్కొంటున్నారు. రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా స్పందించి సదరు బిల్డర్ ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను తొలగించి అందరి పట్ల ఒకేలా..వ్యవహరించాలని కోరుతున్నారు.