సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): కరెంట్ స్తంభాలకు వేలాడుతున్న ఇంటర్నెట్, కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. విద్యుత్ శాఖ ఇటీవల చేపట్టిన 11కేవీ సర్వేతో విద్యుత్ స్తంభాలు కేబుల్స్ కారణంగా దెబ్బతింటున్నాయని దీంతో కరెంట్ సరఫరాకు అడ్డు తగులుతున్నట్లు గుర్తించారు. కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు, కరెంట్ స్తంభాలు వంగిపోయి ప్రమాదకరంగా మారుతుండటంతో వెంటనే కేబుల్, ఫైబర్ వైర్లను తొలగిస్తున్నారు. దీంతో మంగళవారం నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కరెంట్ తీగలను తొలగిస్తూ చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా నగరవ్యాప్తంగా చేపట్టిన కేబుల్, ఇంటర్నెట్ వైర్ల తొలగింపుతో పలు చోట్ల ఇంటర్నెట్, టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. నగరవాసులకు కొంత అసౌకర్యంగా ఉన్న నేపథ్యంలో కేబుల్ తొలగించే వరకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. అయితే కరెంట్ స్తంభాలకు వేలాడే ఫైబర్, ఇంటర్నెట్, కేబుల్ వైర్లలో 51శాతానికి పైగా నిరుపయోగంగానే ఉన్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే సంబంధిత శాఖలకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. ఆపరేటర్లకు ముందస్తు సమాచారంతోనే తొలగిస్తున్నామని విద్యుత్ అధికారులు స్పష్టం చేశారు. అనుమతి లేని కేబుళ్లను మాత్రమే తొలగిస్తున్నామని, అధిక బరువు కారణంగా కరెంట్ వైర్లు తెగిపడే ప్రమాదం ఉండటంతోనే తొలగిస్తున్నట్లుగా వెల్లడించారు.