ప్రజాపాలనలో సామాన్య, మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా సర్కారు దాడి కొనసాగుతున్నది. తెల్లవారుజామున నిద్రలేవకముందే ఇండ్లు, చిరు వ్యాపారం చేసుకునే దుకాణాలపై దాడులు చేయిస్తూ ప్రభుత్వం హైడ్రామా చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నేతలు, పలుకుబడి ఉన్న వ్యక్తులకు నోటీసులతో సరిపెడుతున్న సర్కారు.. పేదోడి గూడుపై మాత్రం కర్కశంగా వ్యవహరిస్తున్నది. కూల్చివేతల్లో సమన్యాయం పాటించాల్సిన హైడ్రా మరోమారు కూకట్పల్లి నల్లచెరువు వేదికగా ద్వంద్వ వైఖరిని ప్రదర్శించింది.
HYDRAA | సిటీబ్యూరో/కేపీహెచ్‌బీ కాలనీ సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ) : కూకట్పల్లి గ్రామంలోని నల్లచెరువు ఎఫ్టీఎల్లో ఆక్రమణలపై హైడ్రా పంజా విసిరింది. ఆదివారం తెల్లవారుజామునే కూల్చాల్సిన నిర్మాణాల వద్దకు హైడ్రా బృందంతో పాటు రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ శాఖల అధికారులు పోలీసు బలగాలతో రంగంలోకి దిగారు. నల్లచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో గుర్తించిన 16 ఆక్రమణలను(రేకుల షెడ్డులను) జేసీబీలతో నేలమట్టం చేశారు. ఏడు గంటలకు మొదలు పెట్టి 11 గంటల వరకు అనుకున్న విధంగా నిర్మాణాలను కూల్చివేశారు. ఈ చెరువు ఎఫ్టీఎల్ పరిధి అంతా… ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పట్టా భూములు కాగా, ఆ భూములను కిరాయికి తీసుకున్న పేద ప్రజలు నడిరోడ్డున పడ్డారు.
మారుమూల గ్రామాల నుంచి నగరానికి వచ్చి, జీవనోపాధికి ఎవరిపై ఆధారపడకుండా పనులు చేసుకుంటున్నారు. మరి కొందరికి ఉపాధి ఇవ్వాలన్న లక్ష్యంతో తక్కువ కిరాయికి స్థలాలను తీసుకుని రేకుల షెడ్డులను నిర్మించుకున్నారు. రేకుల షెడ్డులలో టెంట్‌హౌజ్ సామగ్రి, క్యాటరింగ్, ఫ్లెక్సీలు తయారీ చేసే కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కసారిగా పేదల జీవితాలపై హైడ్రా పేరుతో కొరడా ఝులిపించగా.. ఆ ప్రాంత ప్రజలంతా బెంబేలెత్తారు. మాకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను ఎలా కూల్చుతారని, ఆక్రమణలు చేసిన వారిపై కాకుండా మాలాంటి పేదలపై ప్రతాపం చూపడం సరికాదని వేడుకున్నారు. మాకు తెలియక రేకుల షెడ్డులు నిర్మించుకున్నామని, అందులో ఉన్న సామగ్రి తీసేందుకు సమయం ఇవ్వాలని అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని వాపోయారు. ఇదేమి అన్యాయమని ప్రశ్నించిన వారిని పక్కకు తోసేశారు. ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపట్టగా.. ఆ నిర్మాణాలను నేలమట్టం చేయడంతో లక్షల విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయని బాధితులు బోరున విలపించారు.
కూకట్పల్లి నల్ల చెరువు విస్తీర్ణం 30 ఎకరాలు ఉండగా.. కేవలం 7.36 ఎకరాల స్థలం మాత్రమే చెరువు శిఖం భూమి ఉంది. ఈ చెరువులో మిగిలిన స్థలం పై ప్రైవేట్ వ్యక్తులు పట్టాలు కలిగి ఉన్నారు. చెరువులో ఉన్న పట్టా భూముల్లో నిర్మాణాలు మొదలు పెట్టారు. గతంలో చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు కూడా లభించాయి. తాజాగా, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకపోవడంతో చెరువులో పట్టాలు కలిగిన వ్యక్తులు పట్టా స్థలాన్నీ ప్లాట్లుగా మార్చి భవనాలు, రేకుల షెడ్లను నిర్మించారు. కొందరు వ్యక్తులు పట్టా భూములను పేదలకు అమ్ముకోగా.. మరికొందరు కిరాయిలకు ఇచ్చారు. బతుకు దెరువుకు నగరానికి వచ్చిన పేదలు తక్కువ కిరాయికి వస్తుందని.. చెరువు ఎఫ్టీఎల్ స్థలం అని తెలియక… యజమాని వద్ద కిరాయికి మాట్లాడుకున్నారు. సొంత ఖర్చులతో రేకుల షెడ్డును నిర్మించుకున్నారు. ఈ రేకుల షెడ్డుకు ఆస్తిపన్ను కట్టించుకుంటున్నారు. నల్లా, విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో ప్రతినెలా బిల్లులు చెల్లిస్తున్నారు. ఒక్కసారిగా హైడ్రా అధికారులు వచ్చి ఆ నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో జీవనోపాధి కోసం నిర్మించుకున్న గూడు నేలకొరగడంతో ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడి విలపించడం అందరినీ బాధించింది. ఈ వ్యవహారంలో ప్లాట్ల యజమానులకు శిక్ష పడలేదు. కిరాయికి తీసుకున్న పాపానికి పేదలకు శిక్షపడింది. ఈ నష్టాన్ని ప్రభుత్వం తీరుస్తుందా? ఇన్నాళ్లు అద్దెలు తీసుకున్న యజమానులు భరిస్తారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
కూకట్పల్లి మండలంలోని నల్ల చెరువు విస్తీర్ణం మొత్తం 30. 31 ఎకరాలుగా రికార్డుల్లో నమోదైంది. ఈ చెరువులో ప్రభుత్వ శిఖం భూమి 7.36 ఎకరాలు ఉండగా… మిగిలిన 26 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులు పట్టాలు కలిగి ఉన్నారు. నల్ల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో 18.02 ఎకరాలు, బఫర్‌జోన్‌గా 4.29 ఎకరాలుగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కాగా, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో సుమారు ఏడెకరాల వరకు ఆక్రమణలు వెలిశాయి. ఎఫ్టీఎల్ పరిధిలో మూడెకరాల్లో 25కు పైగా భవనాలు… 16 వరకు షెడ్డులను గుర్తించారు. బఫర్ జోన్ పరిధిలో నాలుగెకరాల స్థలంలో 50 వరకు నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా ఆదివారం హైడ్రా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుర్తించిన 16 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. త్వరలోనే ఈ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో మరిన్ని నిర్మాణాలను తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ స్థలాలు, చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో వెలిసిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఆదివారం మూడు చోట్ల కూల్చివేతలు జరిపి, 8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. కేవలం వ్యాపారం కోసం నిర్మించిన భవనాలను మాత్రమే కూల్చివేశామని, నివాసం ఉంటున్న వారి జోలికి వెళ్లలేదని స్పష్టం చేశారు. కూకట్పల్లి నల్లచెరువులోని సర్వే నంబర్ 66, 67, 68, 69లోని మొత్తం 16 వాణిజ్య షెడ్లు, ప్రహరీలు కూల్చినట్లు కమిషనర్ పేర్కొన్నారు. మొత్తం నాలుగు ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోనూ ఆక్రమణలు కూల్చివేశామని, కిష్ణారెడ్డి పేటలోని సర్వే నం.164లో మూడు భవనాలను కూల్చేవేశామన్నారు. వాణిజ్యపరంగా వినియోగిస్తున్న ఐదంతస్తుల భవనాన్ని కూల్చినట్లు చెప్పారు. ఒక ఎకరాన్ని స్వాధీనం చేసుకున్నామని కమిషనర్ పేర్కొన్నారు. పటేల్‌గూడ సర్వేనంబర్ 12/2, 12/3లోని 25 నిర్మాణాలను కూల్చివేసి 3 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించినట్లు కమిషనర్ తెలిపారు.