మన్సూరాబాద్ : వాన కాలంలో తలెత్తుతున్న వరదనీటి ముంపు సమస్య నుంచి బండ్లగూడ చెరువు ఎగువ, దిగువన ఉన్న ప్రజలకు విముక్తి కల్పించేందుకు ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ పనుల కింద రూ. 49 కోట్లు మంజూరయ్యాయని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఏప్రిల్ లోపు పనులను పూర్తి చేయిస్తామని ఆయన అన్నారు.
ఎస్ఎన్డీపీ పైలెట్ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా రూ. 49 కోట్లతో మన్సూరాబాద్ చిన్న చెరువు నుంచి బండ్లగూడ చెరువు, బండ్లగూడ చెరువు నుంచి మూసీ రివర్ వరకు 4.5 కిలో మీటర్ల మేర నూతనంగా ఏర్పాటు చేయనున్న వరదనీటి బాక్స్‌టైప్ నాలా పనులకు ఆదివారం స్థానిక కార్పొరేటర్ చింతల అరుణతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్ఎన్డీపీ పైలెట్ ప్రాజెక్ట్ లో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 858 కోట్లతో నాలాలను ఏర్పాటు చేయనుండగా.. అందులో ఎల్బీనగర్ నియోజకవర్గానికి రూ. 103 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో ముంపు సమస్యలు ఉండకూడదనే బండ్లగూడ చెరువ కతువా వద్ద నుంచి ఒక నాలా, తూము వద్ద నుంచి మరో నాలాను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.