గుమ్మడిదల, ఏప్రిల్15: ప్యారానగర్ డంపింగ్‌యార్డుకు (Pyaranagar Dumping Yard) ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని అన్నారం గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్ష 70వ రోజుకు చేరుకుంది. ఈదీక్షలో అనంతారం యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు. వీరికి రైతు జేఏసీ నాయకులు సంఘీభావంతెలిపారు. అలాగే నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో రిలే నిరాహారదీక్షలో రైతులు, మహిళలు పాల్గొన్నారు. ఈసందర్భంగా రైతు జేఏసీ నాయకులు మాట్లాడుతూ డంపింగ్‌యార్డు(ఎంఎస్‌డబ్ల్యూ)కు వ్యతిరేకంగా 70 రోజుల నుంచి రిలే నిరాహారదీక్షలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించక పోవడం అన్యాయమన్నారు. ఇక్కడి గ్రామాల ప్రజల బాధలు తెలుకుని సర్కారు డంపింగ్‌యార్డుకు ఇచ్చిన అనుమతులను వెంటనే ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేశారు. ఈదీక్షలో అనంతారం, నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన రైతు జేఏసీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.