కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 8 : తెలిసో తెలియకో ప్రభుత్వ భూముల్లో ఇండ్ల నిర్మాణాలు చేసుకుని జీవిస్తున్న వారికి దినదిన గండంగా ఉండేది. ప్రభుత్వ స్థలాలలో ఇంటిని నిర్మించుకుని ఏండ్ల తరబడి నివాసముంటున్న ఆ ఆస్తి ని అత్యవసర సమయాల్లో అమ్ముకోవాలంటే సరైన డాక్యుమెంటు లేక ఇబ్బందులు పడేవారు. కష్టకాలంలో ఆ ఇంటిని తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చుకోవాలన్నా బ్యాంకుల దగ్గరికి వెళ్లలేని పరిస్థితులు ఎన్నో.. ఈ సమస్యల పరిష్కారానికి గత పాలకులు ఎలాంటి పరిష్కారం చూపకపోవడంతో ఏండ్ల తరబడి ఈ సమస్యలతోనే పేదలు జీవనాన్ని కొనసాగించారు. కాగా.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పేదలకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వ భూముల్లో ఇండ్లను నిర్మించుకున్న పేదలకు క్రబమద్ధీకరణ అవకాశాన్ని కల్పించింది. దీంతో వేలాది కుటుంబాలకు భరోసా లభించింది. జీవో నం. 58, 59తో క్రమబద్ధీకరణ.. ప్రభుత్వ భూముల్లో ఇండ్లను నిర్మించుకుని ఏండ్లతరబడి జీవిస్తున్న పేద కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం 2014లో జీవో నం.58, 59లతో క్రమబద్ధీకరణ అవకాశాన్ని కల్పించింది. ప్రభుత్వ స్థలంలో 125 గజాల లోపు ఇల్లు, షెడ్డు, గుడిసెలు వేసుకుని జీవించే వారికి జీవో నెం.58తో ఉచితంగా క్రమబద్దీకరణ చేసి పట్టాలను అందజేశారు. 125 నుంచి 1000 గజాల వరకు ఉన్న ఇల్లు, ఇతరాత్ర నిర్మాణాలు లేదా అక్రమణలో ఉన్నవారికి ప్రభుత్వం నిర్దేశించిన స్లాబుల ప్రకారం డబ్బులను చెల్లిస్తే ఆ స్థలాలను జీవో నం. 59 ద్వారా క్రమబద్ధీరించారు. జీవో నం.58 ద్వారా క్రమబద్ధీకరణ జరిగిన వారికి ఆ స్థలాలను అమ్ముకునే హక్కులేదు. కానీ.. జీవో నం.59లో క్రమబద్దీకరణ చేసుకుంటే చట్టపరంగా అన్ని హక్కులు కల్పించారు.
6163 స్థలాల క్రమబద్ధీకరణ..
2014లో వచ్చిన జీవో నం.58, 59 ద్వారా కూకట్పల్లి, బాలానగర్ మండలాలలో 6163 స్థలాలను క్రమబద్ధీకరించారు. కూకట్పల్లి మండలంలో జీవో నెం.58 ద్వారా 12,136 దరఖాస్తులు రాగా 6150 దరఖాస్తులను క్రమబద్ధీకరించారు. జీవో నం.59 ద్వారా 392 దరఖాస్తులు రాగా 323 దరఖాస్తులను క్రమబద్ధీకరించారు. జీవో నెం.58 నుంచి 59 లోకి మారిన దరఖాస్తులు 1195 ఉండగా వీటిలో 72 దరఖాస్తుదారులను క్రమబద్దీకరించారు. బాలానగర్ మండలంలో జీవో నం.58తో 375 దరఖాస్తులు రాగా 20 దరఖాస్తులు క్రమబద్ధీకరించారు. జీవో నెం.59లో 133 దరఖాస్తులు రాగా 33 దరఖాస్తులను.. జీవో నం. 58 నుంచి 59కి మారిన 15 దరఖాస్తులను క్రమబద్ధీకరించారు.