సిటీబ్యూరో/తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్12,(నమస్తే తెలంగాణ): ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రతినిత్యం క్యాన్సర్ రోగులకు సేవలందించే రెగ్యులర్ సిబ్బందికి నేటి వరకు వేతనాలు తమ ఖాతాల్లోకి జమ కాలేదు. ఎంఎన్జే నియామకం చేసిన వారికి ఒకటో తేదీనే వేతనాలు వారి ఖాతాల్లో పడగా, డీఎంఈ, డీహెచ్ పరిధిలో పనిచేసే మిగిలిన రెగ్యులర్ సిబ్బందికి పన్నెండు తారీఖొచ్చినా వేతనాలు రాలేదు. దీంతో ఇంటి అద్దెలు, ఈఎంఐలు కట్టేదెలా అంటూ మదనపడుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులను రెండు భాగాలుగా విడదీసి వేతనాల్లో కోతలు పెట్టడం సరికాదని వాపోతున్నారు.
ప్రతిరోజూ 100 మందికిపైగా..
ఎంఎన్జేకు ప్రతిరోజూ 100 మందికి పైగా కొత్త రోగులు వస్తుండగా, ఇన్ పేషెంట్లు 300 మంది వరకు చికిత్స పొందుతుంటారు. వివిధ విభాగాల్లో సుమారు 1000 మందికి పైగా సిబ్బంది పని చేస్తుంటారు. వీరిలో డీఎంఈ, డీహెచ్ పరిధిలో స్టాఫ్ నర్సులు, డాక్టర్లు, నాలుగో తరగతి, మూడో తరగతి ఉద్యోగులు, పరిపాలనా విభాగపు ఉద్యోగులు, హెల్త్ ఇన్స్పెక్టర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నిషియన్లు కలిపి సుమారు 130 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పన్నెండో తేదీ వచ్చినా కూడా వారి ఖాతాల్లో జీతం జమకాలేదు.
అప్పులు చేస్తున్నారు..
గతంలో ఎంఎన్జే స్వయం ప్రతిపత్తి హోదా కారణంగా రెగ్యులర్ సిబ్బందిని నియమించింది. ఇందులో భాగంగా స్టాఫ్ నర్సులు 78 మంది, వైద్యులు 10 మంది నియామకమయ్యారు. వీరికి మాత్రం సకాలంలో వేతనాలు తమ ఖాతాల్లోకి పడుతుండటం గమనార్హం. ఎంఎన్జేలో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా సకాలంలో వేతనాలు వారి ఖాతాలో పడ్డాయి. కానీ రెగ్యులర్ వారికి మాత్రం పడటం లేదు.
గతంలో కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు వైద్య రంగానికి ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఐదో తారీఖు తరువాత వేతనాలు పడుతుండటం, ఇప్పుడైతే ఏకంగా నెలలో సగం రోజులు గడిచినా కూడా జీతాలు చేతికి రావడం లేదు. ఈ కారణంగా ఇంటి అద్దెలు, నెలనెల చెల్లించే ఈఎంఐలు, పరీక్షల సమయం కావడం వల్ల పిల్లల ఫీజులు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి డైరెక్టర్ వేతనాల విషయంలో చొరవ చూపడం లేదన్న వాదన మరోవైపు వినిపిస్తుండటం గమనార్హం.
ఒకటో తారీఖునే జీతాలు వేయాలి
జీతం రాక అప్పు చేసి ఇంటి అద్దె, స్కూల్ ఫీజులు కడుతున్నాం. గతంలో ఒకటో తారీఖునే జీతం పడుతుండేది. ప్రస్తుతం నెలలో సగం రోజులు గడిచినా జీతం చేతికి రావడం లేదు. రెగ్యులర్ ఉద్యోగులను రెండుగా చేసి మాకు అన్యాయం చేసిండ్రు. జీతం ఖాతాల్లో జయం చేయండి.
– శివకుమార్, టీఎన్జీవో యూనియన్ ఎంఎన్జే ఆసుపత్రి అధ్యక్షుడు