మీ ఇల్లు రిజిస్ట్రేషన్ కాలేదా..? ప్రభుత్వ భూముల్లో ఆవాసం ఏర్పాటు చేసుకొని..ఇంటి టాక్స్ చెల్లిస్తూ రిజిస్ట్రేషన్ కావాలని భావిస్తున్నారా..? అయితే కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోని వారై ఉంటే సరిపోతుంది. మీరు చేయాల్సిందల్లా.. రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద మధ్యవర్తిత్వం వహిస్తున్న ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, డాక్యుమెంట్ రైటర్లను సంప్రదించి వారు అడిగినంత ఇస్తే చాలు.. నిమిషాల్లోనే పనైపోతుంది. ఎలాంటి స్లాట్ బుకింగ్ లేకుండా క్షణాల్లో రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు మూడు నిమిషాల వ్యవధిలోనే గిఫ్ట్ డీడ్ పూర్తి చేసుకోవచ్చు. కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న అడ్డగోలు రిజిస్ట్రేషన్ల వ్యవహారమిది. ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్రమాలకు అంతులేకుండా పోతుందన్న చర్చ జరుగుతున్నది.
సిటీబ్యూరో /దుండిగల్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : వాస్తవానికి గడిచిన ఏడాదిన్నర కాలంగా కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇంటి పన్ను రసీదుల ఆధారంగా జరిగే రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి, డి.పోచంపల్లి, బహదూర్‌పల్లిలోని కొన్ని ప్రాంతాలు మినహా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాలలోని భూములు, ఇండ్ల స్థలాలు, ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని జరుగుతున్నాయి.
హౌస్ టాక్స్‌లపై రిజిస్ట్రేషన్లు గందరగోళంగా మారడంతో ఏడాదిన్నర కాలంగా ఇక్కడ ఇంటి పన్ను పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. గత ఏడాది కిందట ఇక్కడ సబ్ రిజిస్టర్‌గా పని చేసిన జ్యోతి ఓ తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారన్న నెపంతో ఆమెను విధుల్లోంచి తప్పించిన ప్రభుత్వం..ఆమెను జైలుకు కూడా పంపింది. తాజాగా అశోక్ కుమార్ అనే రిజిస్ట్రేషన్ అధికారి బాచుపల్లిలోని నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేశారని, అది గిప్ట్ డీడ్‌గా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆయనను సర్కారు సస్పెండ్ చేసింది.
అయితే అశోక్‌కుమార్ ఉన్న సమయంలో ఇంటి పన్ను రసీదుల ఆధారంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా సాగలేదు. ఆయన వెళ్లపోగానే ఇటీవల కాలంలో ఇంటి పన్ను రసీదుతో రిజిస్ట్రేషన్లు చకచకా జరిగిపోతున్నాయి. 60 గజాల లోపు వాటిని చేయొచ్చన్న ముసుగులో 100 గజాల దాటిన వాటిని సైతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా కొందరు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు ?
కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రస్తుతం ముగ్గురు సబ్రిజిస్ట్ట్రార్లు(జాయింట్ రిజిస్ట్ట్రార్ 1,2,3) పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతినిత్యం సరాసరి 150 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. అధికారులు డాక్యుమెంట్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అవి క్లియర్ టైటిలేనా, ప్రభుత్వ భూములా..? నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయా..? వాటిపై ఏవైనా వివాదాలు అభ్యంతరాలు ఉన్నాయా?..వంటి వాటిని పరిశీలించిన అనంతరమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.
కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఇక్కడి అధికారులు కేవలం ఇంటి పన్ను రసీదులపైనే రిజిస్ట్రేషన్లు చేయడం చూస్తుంటే అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు లక్షల రూపాయలు వసూలు చేస్తూ క్షణాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నది. ఇందుకు తాజాగా చోటు చేసుకున్న ఓ రిజిస్ట్రేషన్ ఊతమిస్తోంది. బాచుపల్లి మండలం, రాజీవ్‌గాంధీనగర్‌లోని ఓ 110 గజాల స్థలంలో ఉన్న ఇంటికి సంబంధించి ఇంటి పన్ను పత్రాల ఆధారంగా ఈ నెల 8న ఓ మహిళ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.
కరెక్టుగా మరో మూడు నిమిషాల వ్యవధిలోనే అదే రిజిస్ట్రేషన్ పత్రాలను గిప్ట్ డీడ్‌గా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. లక్షల్లో డబ్బులు తీసుకొని క్షణాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ చేశారని పేర్కొంటున్నారు. కేవలం ఒకే ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్, గిప్ట్ డీడ్ రిజిస్ట్రేషన్లు మూడు నిమిషాల వ్యవధిలో పూర్తవడం గమనార్హం. నిత్యం రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ తిరిగే సామాన్య జనం… మరికొందరు మాత్రం అధికారులు అడిగినంత ఇస్తే ఇలాంటి అద్భుతాలు జరుగుతూనే ఉంటాయన్న చర్చ లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఒక్కరోజులోనే రూ. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు వినికిడి.
ఔట్సోర్సింగ్ ఉద్యోగి సూత్రధారి..
ఇటీవల ఇటువంటి డాక్యుమెంట్లు కుప్పలు తెప్పలుగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి అధికారులకు అందించే విషయంలో కార్యాలయంలో పని చేసే ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఉద్యోగుల్లోనే చర్చ జరుగుతున్నది. తను స్వయంగా ైక్లెంట్లతో మాట్లాడకపోయినా డాక్యుమెంట్ రైటర్ల ద్వారా దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఈ అక్రమ దందాపై ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ జరిపితే కుప్పలు తెప్పలుగా ఇటువంటి రిజిస్ట్రేషన్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇదే విషయంపై కుత్బుల్లాపూర్ జాయింట్ రిజిస్టార్-1 మధుబాబును వివరణ కోరగా, మొదట్లో అలాంటిదేమి లేదని, ఒకవేళ ఇంటి నంబరు పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తే 60 గజాల లోపు ఉంటేనే చేస్తామన్నారు. మరీ 110 గజాల ఇంటిని, అది కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే రెండు రిజిస్ట్రేషన్లు ఎలా చేశారని ప్రశ్నిస్తే తర్వాత మాట్లాడుదామంటూ మాట దాటవేయడం గమనార్హం.