సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఆర్టీఓ కార్యాలయాల్లో సరిపడా సిబ్బంది లేక నిర్ణీత సమయంలో పనులు పూర్తికావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పెద్ద సారు లేరని ఫైళ్లను వారాలకొద్దీ పోగు చేస్తున్నారు. నగరంలో బండ్లగూడ, సికింద్రాబాద్, మలక్‌పేటకు పూర్తిస్థాయిలో ఆర్టీఓ అధికారి లేకపోవడంతో ఆ పనిభారం అంతా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లపై పడుతున్నది.
ఇన్చార్జి ఆర్టీఓలు ఒకే రోజు రెండు కార్యాలయాలు తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఉదయం ఓ కార్యాలయం.. మధ్యాహ్నం మరో కార్యాలయంలో విధులు నిర్వర్తించాల్సి వస్తున్నదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ 200 మందికి పైగా వాహనదారులు సంబంధిత పనులపై కార్యాలయాలకు వస్తుంటారు. ఓ వైపు వార్షిక టార్గెట్ పూర్తి చేయడం, వాహనాల తనిఖీలతో పాటు అదనంగా మరో కార్యాలయంలోనూ విధులు చేయక తప్పని పరిస్థితులు రవాణా శాఖలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏజెంట్లదే హవా..!
రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ రవాణా శాఖ కార్యాలయాల్లో కొన్ని కార్యాలయాలు ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లిపోయాయని వాహన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నిర్ణీత సమయంలో అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ఏజెంట్లను ఆశ్రయిస్తే పని తొందరగా పూర్తి అవుతుందని వాహనదారులు చెబుతున్నారు. పనిని బట్టి ధర ఫిక్స్ చేసి వసూళ్ల దందాకు తెరలేపారని విమర్శలు వస్తున్నాయి.
ఓ ఉన్నతాధికారి కార్యాలయంలో పనిదినాల్లో రెండు రోజులకు మించి అందుబాటులో ఉండరని సదరు కార్యాలయ సిబ్బం దే చర్చించుకుంటున్నారు. ఎంవీఐలు సైతం వారంలో నాలుగు రోజులు ఓ కార్యాలయం.. మరో రెండు రోజులు ఇంకో కార్యాలయంలో విధులు నిర్వర్తించాల్సి వస్తున్నది. దీంతో ఏ అధికారి ఏం చేస్తున్నాడో పర్యవేక్షించాల్సిన ఆ ఉన్నతాధికారి చోద్యం చూస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి తన కారును యెల్లో నంబర్ ప్లేట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
అధికారులు ఆపనిని పూర్తి చేయడానికి 10 రోజుల సమ యం మించింది. అయినా పని పూర్తి కాలేదు. దీంతో సదరు వ్యక్తి ఏజెంట్‌ను ఆశ్రయించి డబ్బులు కట్టబెట్టా డు. దీంతో ఆ పని 2 రోజుల్లో పూర్తయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ అధికారి లేకున్నా డబ్బులు ఇస్తే పనిచేసి పెడతామంటూ ఏజెంట్లు వాహనదారులతో బేరాలు సాగిస్తున్నారు.
ఉదయం బండ్లగూడ .. మధ్యాహ్నం మలక్‌పేటలో..
సికింద్రాబాద్‌లో 6 నెలల నుంచి ఆర్టీఓను కేటాయించలేదు. ఎంవీఐనే ఇన్చార్జి ఆర్టీఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక బండ్లగూడ, మలక్‌పేట ఆర్టీఓ కార్యాలయాల్లో మంచిర్యాల నుంచి బదిలీపై వచ్చిన ఆర్టీఓ కిష్టయ్యను రెండు కార్యాలయాలకు ఇన్చార్జిగా నియమించారు. ఉద యం బండ్లగూడలో ఉంటే మధ్యాహ్నం మలక్‌పేటలో విధులు నిర్వర్తిస్తున్నారు. మరో రోజు ఉదయం మలక్‌పేటలో ఉంటే మధ్యాహ్నం బండ్లగూడ ఆర్టీఓ కార్యాలయంలో ఉంటున్నారు.
ఈ లెక్కన సారు ఏ రోజు ఎక్కడ ఉంటున్నారో.. తెలియక వాహనదారులు కార్యాలయం ముందర ఎదురుచూడాల్సిన పరిస్థితి. సారూ ఏ రోజు ఉంటారని అధికారులను అడిగినా.. తమకు తెలియదని సిబ్బంది సమాధానమిస్తున్నారు. బండ్లగూడ, మలక్‌పేటలో చాలా వరకు పెద్ద ఎత్తున స్క్రాప్ ప్రక్రియ సాగుతుంది. ఆటోలు ఎక్కువగా స్క్రాప్‌నకు వస్తుంటాయి. గతంలో ఆటోల స్క్రాప్‌లో కొందరు యజమాని లేకుండానే ఆటోను స్క్రాప్ చేయడానికి యత్నించిన సంఘటనలున్నాయి. లోతు గా పరిశీలిస్తే గానీ లొసుగులను గుర్తించడం కుదరదు. ఇలాంటి ప్రయత్నాన్ని ఓ ఆర్టీఓ గుర్తించి ఆపారు. నిజమైన ఆటో ఓనర్‌ను పిలిపించి న్యాయం చేశారు. కీలకంగా వ్యవహరించాల్సిన ఎంవీఐలపై అదనపు పనిభారంతో చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.