సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఓ సాప్ట్వేర్ ఉద్యోగినికి రెడ్డి మ్యాట్రిమోని వెబ్సైట్లో డాక్టర్‌గా పరిచయమై రూ. 64 లక్షలు కాజేశాడు. వివరాల్లోకి వెళితే..ఎల్బీనగర్ రాక్‌టౌన్ కాలనీకి చెందిన బాధితురాలు సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆమెకు రెడ్డి మ్యాట్రిమోని వెబ్సైట్ ద్వారా డాక్టర్ భరత్‌భూషణ్‌రెడ్డి పేరుతో వ్యక్తి పరిచయమయ్యాడు. ఫోన్ నంబర్లు, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరి గూర్చి ఒకరు మాట్లాడుకుని పెండ్లికి ఓకే అనుకున్నారు. భరత్‌భూషణ్ పేరుతో మాట్లాడిన సైబర్‌నేరగాడు తన వ్యాలెట్ పోయిందని తనకు అర్జెంట్‌గా లక్ష రూపాయాలు కావాలని కోరగా ఆమె డబ్బులు పంపించింది.తర్వాత అర్జెంట్‌గా రూ. 18 లక్షలు అవసరమున్నాయంటూ కోరాడు.
మరోసారి రూ. 40 లక్షలు వసూలు చేశాడు. కొంత కాలం తరువాత తన డబ్బులు తనకు ఇవ్వాలంటూ బాధితురాలు కోరింది. అయినప్పటికీ మరికొన్ని డబ్బులు వసూలు చేశాడు. త్వరలో తమ తల్లిదండ్రులు వచ్చి పెండ్లి విషయం మాట్లాడుతారని, అన్ని పనులు పూర్తవుతాయంటూ రోజులు దాటవేస్తూ వచ్చాడు. మోసపోయాయని గుర్తించిన బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.