కేపీహెచ్బీ కాలనీ, జనవరి 16: జీహెచ్ఎంసీలోని కాలనీలు, బస్తీలు, రహదారులన్నీ పరిశుభ్రంగా మార్చడంలో పారిశుధ్య కార్మికుల సేవలే కీలకం. నగరం నలుమూలలా పారిశుధ్య కార్మికులు రోజంతా కష్టపడి పని చేయడంతో స్వచ్ఛ నగరంగా మారుతున్నది. ఉదయాన్నే లేచి రోడ్లపైకి చేరి విధులు నిర్వర్తించాలంటే ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ.. కొందరు కార్మికులు దీర్ఘకాలిక అనారోగ్యం, ఇతరాత్ర సమస్యలతో విధులకు దూరమవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికుల్లో అనారోగ్యం, వయస్సు పైబడడం వల్ల విధులు నిర్వర్తించడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మిగిలిన కార్మికులపై అదనపు పని భారం పడుతున్నది. ఈ సమస్యను గుర్తించిన జీహెచ్ఎంసీ దీర్ఘకాలికంగా విధులకు హాజరు కాని, అరవై ఏండ్లకు పైబడిన వారిని తొలగించి, పని చేయడానికి ఆసక్తి ఉన్న వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కూకట్పల్లి జంట సర్కిళ్లలో పారిశుధ్య కార్మికుల నియామకాలకు కసరత్తు చేస్తున్నారు.
జంట సర్కిళ్లలో 209 ఖాళీలు
కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో 1785 మంది పారిశుధ్య కార్మికులు ఉండగా వీరిలో నిత్యం విధులు నిర్వర్తిస్తున్నవారు 1576 మంది మాత్రమే. జంట సర్కిళ్లలో 209 ఖాళీలు ఉన్నాయి. వీరిలో దీర్ఘకాలికంగా విధులకు హాజరు కానివారు 171 మంది, రెండు సర్కిళ్లలో 20 మంది కార్మికులు మరణించారు. 18 మంది ఇతరేతర కారణాల వల్ల విధులకు హాజరుకావాడం లేదు. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే మూసాపేటలో 959 మంది పారిశుధ్య కార్మికులు ఉండగా 854 మంది పని చేస్తున్నారు. 105 ఖాళీలున్నాయి. కూకట్పల్లి సర్కిల్లో 826 మంది ఉండగా 722 మంది నిత్యం విధులకు హాజరవుతున్నారు. 104 ఖాళీలున్నాయి. విధులకు హాజరు కాని వారి స్థానంలో ఆసక్తిగల వారిని నియమించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండి ప్రాణాలు కోల్పోయిన పారిశుధ్య కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వనున్నారు.
నలభై ఏండ్లలోపు వారికి..
పారిశుధ్య కార్మికుడిగా పని చేయాలనుకునే వారి వయస్సు నలభై ఏండ్ల లోపు ఉండాలి. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల్లో అరవై ఏండ్లు పైబడిన వారిని తొలగిస్తూ, వారి స్థానంలో అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు గాని.. కొత్త వారికి గాని అవకాశాన్ని కల్పించనున్నారు. జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం నిర్వర్తించాల్సిన విధుల పట్ల ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జోనల్ కమిషనర్ అధ్యక్షతన డిప్యూటీ కమిషనర్, ఏఎంహెచ్వోలతో కూడిన కమిటీ దరఖాస్తులు పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారించిన తర్వాతే నియామక పత్రాలు అందజేస్తారు. ఈ ప్రక్రియలో ఎక్కడా అనుమానాలకు తావులేకుండా పూర్తిస్థాయిలో పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆసక్తి ఉన్నవారికే అవకాశం
సర్కిల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల్లో అరవై ఏండ్లకు పైబడిన వారిని, దీర్ఘకాలింగా విధులకు హాజరు కాని వారిని తొలగిస్తున్నాం. జీహెచ్ఎంసీ నిబంధనలు పాటిస్తూ జోనల్ కమిటీ ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేస్తున్నారు. పనిచేస్తూ చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి అవకాశం ఉంటుంది. ఇటీవలే జోనల్ కమిషనర్ సమక్షంలో కారుణ్య నియామకాలకు ఇంటర్వ్యూలు జరిగాయి. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలి.
– కె.రవికుమార్, డీసీ, మూసాపేట