సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో నిబంధనలకు తిలోదకాలిస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్బన్ బయోడైవర్సిటీ విభాగంలో ఫీల్ట్ అసిస్టెంట్లు సూపర్వైజర్స్) 39 మంది, టెక్నికల్ అసిస్టెంట్లు (సూపర్వైజర్స్) 18 మంది కలిపి మొత్తం 57 మంది భర్తీకి టెండర్ పిలిచారు. ఒక్కొక్కరి నెలవారి వేతనం రూ.18,413లు ఉండగా నెలకు అలవెన్స్ రూ.1000 అదనంగా ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్టాండింగ్ కమిటీలో ఈ అంశాన్ని పెట్టి ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం జరిగింది..కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ ఉద్యోగి నియామకం జరపాలన్న ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది.
కానీ ఘనత వహించిన అర్బన్ బయో డైవర్సిటీ విభాగం మాత్రం ఇవేమి పట్టలేదు.. జీహెచ్ఎంసీకి సంబంధించిన ఏ విషయమైన స్టాండింగ్ కమిటీలో ఎజెండా అంశంగా పెట్టి చర్చించిన అనంతరం కమిషనర్‌కు ఆ తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ 57 మంది నియామకంలో కమిషనర్‌కే నేరుగా ఫైల్ పెట్టి ఆమోదం తీసుకున్న అర్బన్ బయోడైవర్సిటీ విభాగం వ్యవహారం ఉద్యోగుల్లో చర్చకు దారి తీసింది.
టెండర్ పద్ధతిలోనే నియామకం జరిపిన ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కమిషనర్‌ను తప్పుదోవ పట్టించారన్న వాదనలు లేకపోలేదు. ప్రతి ఏటా తరహాలోనే ఫీల్ట్ అసిస్టెంట్ల నియామకం జరిగిందని బయో డైవర్సిటీ విభాగం చెబుతున్నది. ఈ విషయంలో అసలేం జరిగింది? కోణంలో కమిషనర్ మరోసారి పునర్ సమీక్షించాలని పలువురు కోరుతున్నారు.