Heavy Rain Fall | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి నగర వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 12.3 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, ఖైరతాబాద్‌లో 11.13 సెం.మీ., సరూర్‌నగర్‌లో 10.6, ఉప్పల్‌లో 9.5, షేక్‌పేట్‌లో 9, ఉప్పల్ న్యూనాగోల్‌లో 8, బండ్లగూడలో 8, దిల్‌సుఖ్‌నగర్‌లో 8.2, లింగోజిగూడలో 7.6, మలక్‌పేట్ ఆస్మాన్‌గఢ్‌లో 7.6, ఉప్పల్ రామాంతపూర్‌లో 7.5, నాగోల్‌లో 7.4 బాలానగర్‌లో 7, జూబ్లీహిల్స్‌లో 6.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ఈ భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. పలు బస్తీలు, కాలనీలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. గంట వ్యవధిలో 9 సెం.మీ. వర్షపాతం కురిసింది.
పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి వరకు జూబ్లీహిల్స్ మీదుగా, ఖైరతాబాద్ నుంచి బేగంపేట్ వరకు, మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వరకు, గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు, మలక్‌పేట్ నుంచి హయత్‌నగర్ వరకు, బషీర్‌బాగ్ నుంచి కోఠి మీదుగా మలక్‌పేట్ వరకు, ట్యాంక్‌బండ్ నుంచి ఎస్పీరోడ్, ఆర్పీరోడ్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక్క వాహనం కూడా ముందుకు కదలడం లేదు. కూకట్పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మల్కాజ్గిరి, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, సికింద్రాబాద్, నాంపల్లి, చార్మినార్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, ఐకియా, బయో డైవర్సిటీ, కొండాపూర్ జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతాబాద్ – రాజ్‌భవన్ రహదారి నీట మునిగింది.
ఈ క్రమంలో ఎమర్జెనీ బృందాలు అప్రమత్తం అయ్యాయి. సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు నిమగ్నమయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనుల్లో విద్యుత్ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.