సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టిస్తున్నది. గత ఏప్రిల్ 1నుంచి మార్చి 6వ తేదీ నాటికే 12.95 లక్షల మంది నుంచి రూ. 1520 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. ఇదే సమయానికి గతేడాది 10.92 లక్షల మంది నుంచి దాదాపు రూ.1210 కోట్లు మాత్రమే వచ్చాయి. గతేడాది కంటే ఈ సారి అధికంగా రూ.310 కోట్ల ఆదాయం రాబట్టడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎర్లీబర్డ్ స్కీం ద్వారా ఏకంగా రూ. 741.35కోట్ల మేర ఆదాయం సమకూరడం ఒక కారణమైతే, కమిషనర్ లోకేశ్కుమార్తో సహా ఉన్నతాధికారులంతా ఆస్తిపన్ను వసూళ్లపై ప్రధాన దృష్టి సారించారు.
జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో కమిషనర్లతో కమిషనర్ తరుచూ సమావేశాలు నిర్వహిస్తూ సిబ్బందికి నెలవారీగా టార్గెట్లు ఇస్తూ లక్ష్యం పూర్తి అయ్యేలా ప్రయత్నిస్తుండటమే రికార్డు స్థాయి వసూళ్లు కావడానికి కారణం. దాదాపు 18 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఉండగా, 70శాతం మేర ఇప్పటికే వసూళ్లను రాబట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికల్లా రూ. 2000వేల కోట్ల నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నెలలో బకాయిదారులపై స్పెషల్ డ్రైవ్
ఈ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున సర్కిళ్ల వారీగా మొండి బకాయిదారులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు జోన్ల వారీగా లక్ష్యాలు ఖరారు చేశారు. ఈ నెలాఖరు నాటికల్లా అదనంగా రూ. 500కోట్ల మేర రెవెన్యూను రాబట్టి లక్ష్యాన్ని చేరుకొనేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఈ మేరకు 4,79,690 మంది బకాయిదారులను గుర్తించి, ఈ మేరకు సంబంధిత యజమానులకు రెడ్ నోటీసుల జారీ చేస్తున్నారు. రెడ్ నోటీసుల్లో పేర్కొన్న గడువులోగా ఆస్తిపన్ను చెల్లించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునే దిశగా చర్యలు చేపడుతున్నారు.
రెడ్ నోటీసుల ద్వారా వీలైనంత మేర ఆస్తిపన్ను వసూలు చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రతి ఏటా తరహాలోనే ప్రతి ఆదివారం ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం కార్యక్రమం నిర్వహించే దిశగా చర్యలు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ కార్యక్రమంతో ప్రజలు అసెస్మెంట్లలో లోపాలతో పాటు ఇతరత్రా సమస్యలను పరిష్కరించవచ్చని అధికారులు భావిస్తున్నారు.