అమీర్‌పేట్, మే 25 : రిటైరైన ఉద్యోగికి చెందిన పెన్షన్ బెనిఫిట్ సెటిల్మెంట్కు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదించేందుకు రూ. 20 వేల లంచం డిమాండ్ చేసిన ఉద్యోగిని, నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అమీర్‌పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్‌గా ఉన్న శివానంద్ ఇటీవల రిటైర్డ్ అయినా ఓ మహిళా ఉద్యోగికి సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్లకు సంబంధించి వివరాలను ఉన్నతాధికారులకు పంపేందుకు లంచం డిమాండ్ చేశారు.
సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తన కార్యాలయంలో ఫిర్యాదుదారు నగదును అందుకుంటుండగా ఏసీబీ సిటీ రేంజ్ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. నిందితుడు శివానంద్‌ను అరెస్ట్ చేసి ఏసీబీ కేసుల గౌరవ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరిచిన అనంతరం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.