సున్నంచెరువు సమీపంలో ఉన్న సియేట్ కాలనీలో హైడ్రా కూల్చివేసిన చోట తిరిగి భవనం నిర్మించడం, అలైన్మెంట్ మార్చడంపై నమస్తే తెలంగాణలో వచ్చిన కథనంపై హైడ్రా కార్యాలయంలో చర్చ జరిగింది. తాము కూల్చివేసిన చోట తిరిగి భవనం నిర్మించిన అంశంపై ఆ భవనం ఎఫ్టీఎల్లో లేదని, వారికి భవన నిర్మాణ అనుమతులు ఉన్నాయంటూ హైడ్రా అధికారులు చెప్పారు. కానీ అసలు భవనం ఎందుకు కూల్చేశారు.. ఇప్పటి వరకు సున్నంచెరువుకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ రాకపోగా మొదటి నుంచి సియేట్ కాలనీ వాసులు తమ ప్లాట్లు ఉన్న సర్వే నంబర్లకు సున్నం చెరువుకు సంబంధం లేదంటూ అభ్యంతరాలు చెబుతూనే ఉన్నారు.
సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ) : హైకోర్టులో ప్లాట్ల యజమానులు తమ భూముల విషయంలో హైడ్రా జోక్యం వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న వ్యాజ్యం,హైడ్రా అధికారులు వచ్చి ఆ ప్లాట్ల దగ్గర చెరువు హద్దుల్లో ఉన్నాయంటూ ఫెన్సింగ్ వేయడంతో ఈ మొత్తం వ్యవహారం గందరగోళంగా మారింది. ప్రస్తుతం ఈ భూమికి సంబంధించిన వివాదం కోర్టులో కొనసాగుతుండగా హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో పెట్టింది. అప్పటివరకు ఇక్కడ ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని, భూమి ఆకారంలో ఎలాంటి మార్పులు చేయవద్దంటూ స్టేటస్కో ఇచ్చింది.
కానీ హైడ్రా మాత్రం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఫెన్సింగ్ వేయడం, ప్లాట్లలో తవ్వకాలు జరుపుతున్నారని సియేట్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో 2024 సెప్టెంబర్‌లో హైడ్రా కూల్చివేతల్లో ఒక భవనాన్ని కూల్చివేయగా అదే స్థానంలో మళ్లీ భవనాన్ని కట్టడంపై నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది. అక్కడ మొదట అలైన్మెంట్ చేసిన హైడ్రా అధికారులు ఆ తర్వాత కొన్ని రోజులకు కమిషనర్ రంగనాథ్‌కు దగ్గరి మిత్రుడి ప్లాట్ ఉందంటూ అలైన్మెంట్ మరికొంతముందుకు జరిపి చేయడంపై సియేట్ కాలనీ ప్లాట్ల యజమానులు విమర్శిస్తున్నారు. అయితే హైడ్రా కూల్చివేసిన చోటనే మళ్లీ భవన నిర్మాణం జరుగుతుండడంపై నమస్తేలో కథనం వచ్చిన తర్వాత సియేట్కాలనీకి చెందిన కొందరు హైడ్రా ఆఫీసుకు, అధికారులకు ఫోన్ చేసినట్లు సమాచారం. తాము కూడా కట్టుకుంటామని, తమకు కూడా అనుమతులు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.
ఈ విషయంలో హైడ్రా అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కమిషనర్‌తో జరిగే సమావేశంలో అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పినట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారం తేల్చడానికి ఈనెల 14న హైడ్రా కార్యాలయంలో సియేట్ కాలనీ వాసులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇందులోనే సున్నంచెరువుకు సంబంధించిన హద్దులు, సియేట్కాలనీ వాసుల అభ్యంతరాలతో పాటు పలు విషయాలపై చర్చిస్తారని హైడ్రా అధికారులు చెప్పారు. అయితే సియేట్కాలనీ వాసులు మాత్రం హైడ్రా కమిషనర్ తమ కార్యాలయానికి పిలవడం వెనక అంతర్యమేమిటని, ఆయన తమతో ఏది మాట్లాడాలన్నా సియేట్ ప్లాట్ల దగ్గరకు వచ్చి ఇన్‌కెమెరా మాట్లాడితేనే తమకు సమ్మతమని చెబుతున్నారు. ఎందుకంటే కోర్టులో వివాదం కొనసాగుతుండగా తాము హైడ్రా కార్యాలయానికి వెళ్లడం ఎంత వరకు సమంజసమనే విషయం కూడా ప్రస్తుతం న్యాయవాదులతో చర్చిస్తున్నామని వారు పేర్కొన్నారు.
