సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకు కుదేలవుతున్నది. ఇండ్లు, ఇండ్ల స్థలాలు కొనేవారు ముఖం చాటేస్తుండటంతో పాటు కమర్షియల్ రియల్ వ్యాపారం మరింత దిగువకు పడిపోతున్నది. గ్లోబల్ సమ్మిట్, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం గప్పాలు కొట్టకుంటున్నా..ఒక్క కొత్త కంపెనీ హైదారాబాద్ వైపు చూడటం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లవుతున్నా కొత్త ఐటీ, కమర్షియల్ కంపెనీలు రాకపోవడంతో ఆఫీస్ లీజింగ్ భారీగా తగ్గిపోయింది. ప్రభుత్వ అసమర్థత వల్ల హైదరాబాద్లో ఆఫీస్ లీజింగ్ 19 శాతం పడిపోయింది. తాజాగా కొలియర్స్ ఇండియా విడుదల చేసిన నివేదికలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఆఫీస్ లీజింగ్ గరిష్ఠ వృద్ధి సాధించింది.
కానీ హైదరాబాద్లో మాత్రం గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. కాంగ్రెస్ విధానాలు, అభివృద్ధి కుంటుపడుతుండటం, కొనుగోలుదారులకు భరోసా కరువవుతుండటంతో మరింతగా దిగజారిపోతున్నది. గణనీయంగా పడిపోతున్న ధరలకు నగర రియల్ వ్యాపారానికి కోలుకోలేని దెబ్బ తగులుతున్నది. ప్రభుత్వం ఇష్టారీతిన భూముల వేలాలను నిర్వహించి, రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయని ప్రకటనలు ఇస్తున్నా కంపెనీలు కన్నెత్తి చూడటంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కుదరకపోవడంతో అటు రెసిడెన్షియల్ మార్కెట్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో హౌజింగ్ అమ్మకాలు 19శాతం పడిపోయింది. తాజాగా ఆఫీస్ లీజింగ్ కూడా అంతే స్థాయిలో దిగజారిపోయింది. ఇక ఫ్లాట్లకు గతేడాదితో పోల్చితే డిమాండ్ దారుణంగా పడిపోతుంది.
దేశంలో ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒక్కటే రియల్ వ్యాపారంలో మరింత దిగువకు పడిపోయింది. ఇటీవల వరుసగా వస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపార నివేదికలన్నింటిలో హైదరాబాద్ అత్యంత తక్కువ అమ్మకాలను నమోదు చేస్తున్నది. నివేదికలన్నీ ముక్తకంఠంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోతున్నదని తేల్చ చెబుతున్నాయి. తాజాగా వచ్చిన ఆఫీస్ లీసింగ్ నివేదిక ప్రకారం హైదరాబాద్ అత్యంత దిగువకు పడిపోయింది. కొలియర్ ఇండియా నివేదిక ప్రకారం గతంతో పోలిస్టే దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ లీసింగ్ 71.5 మిలియన్ స్కేర్ ఫీట్లు నమోదు చేసింది. ఇందులో చెన్నై, బెంగళూరు, పుణె, కలకత్త, ఢిల్లీ నగరాల్లో ఆఫీస్ లీజింగ్ బిజినెస్ గతం కంటే ఎక్కువగా నమోదైంది. కానీ హైదరాబాద్, ముంబైలో మాత్రం అది అత్యంత దిగువకు పడిపోయింది. ముంబై -5 శాతం నమోదు చేస్తే హైదరాబాద్లో అత్యంత దారుణంగా పడిపోయి -19 శాతం నమోదు చేసింది. చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ఆఫీస్ లీజింగ్ వ్యాపారం క్షీణించింది.
నగరంలో రెసిడెన్షియల్ సెగ్మెంట్లో డిమాండ్ గణనీయంగా పడిపోతున్నది. హైదరాబాద్లో రెసిడెన్షియల్ అమ్మకాలు కూడా 19 శాతం తగ్గుదల నమోదు చేశాయి. అక్టోబర్ 2025లో రిజిస్ట్రేషన్లు 5 శాతం పెరిగితే, లగ్జరీ సెగ్మెంట్లో కొంత డిమాండ్ ఎక్కువగా ఉంది. జనవరి నుంచి అక్టోబర్ వరకు 61,699 రిజిస్ట్రేషన్లు జరిగినా.. గడిచిన ఏడాదితో పోల్చితే 10 శాతం తక్కువే. కానీ ఆదాయం విషయంలో మాత్రం 25 శాతం పెరుగుదల ప్రీమియం ఫ్లాట్లకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తుంది. కానీ ఆఫర్డబుల్ సెగ్మెంట్లో డిమాండ్ తగ్గిపోవడం నగరంలో సామాన్యుడికి ప్రతికూలంగా మారుతుందని సూచిస్తోంది. ఈ లెక్కన భవిష్యత్లో ఇండ్ల ధరలు మరింత పెరిగితే.. నగరంలో కొనుగోలు చేయడమే కష్టతరం అవుతుందని, పేదోడి సొంతింటి కల కలగానే మిగిలిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక అమ్మకాలు క్రమంగా పడిపోతుండటంతో కొత్త ప్రాజెక్టుల లాంచింగ్లు కూడా మందకోడిగా సాగుతున్నాయి. నిర్మాణ సంస్థలు కూడా కొత్త ప్రాజెక్టులను ఆవిష్కరించడం కంటే పాత ప్రాజెక్టులో మిగిలిన ఇన్వెంటరీని తగ్గించుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ క్రమంలో బిల్డర్ ఆర్థిక వనరుల సర్దుబాటుకు తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో ఉన్న ఫ్లాట్లను క్రమంగా విక్రయించుకోవడం ద్వారా కంపెనీలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నాయి. గడిచిన రెండేండ్లలో కొత్త ప్రాజెక్టుల అనుమతులు, హైడ్రా కూల్చివేతలు, మార్కెట్ తిరోగమనం దృష్ట్యా లాంచింగ్లూ కూడా గడిచిన మూడేండ్లతో పోల్చితే 20శాతం మేర తగ్గినట్లుగా చెబుతున్నారు.