సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్‌లో మంచి లాభాలొస్తాయంటూ నమ్మించి రిటైర్డు అదనపు ఎస్పీ నుంచి 15 నెలల్లో రూ.14.7 కోట్లు వసూలు చేసి ఒక కుటుంబం పరారైంది. బాధితుడు రిటైర్డు అదనపు ఎస్పీకి ఆ కుటుంబ సభ్యులందరు దగ్గరై నమ్మించి ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసును హైదరాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేశారు. దీంతో తాజాగా సీసీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. కోకాపేట్‌లోని పౌలోమి అపార్టుమెంట్లో నివాసముండే జనార్దన్ రెడ్డి(81) రిటైర్డు అదనపు ఎస్పీ. కాగా 2023 ఫిబ్రవరిలో రాకేశ్ మాన్యం పరిచయమయ్యాడు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగుందని మంచి లాభాలొస్తాయంటూ మాయమాటలు చెప్పాడు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులందరినీ పరిచయం చేసి.. రియల్ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారంటూ నమ్మించాడు.
ఇలా ఆయనతో కొన్నాళ్లు అందరూ స్నేహంగా ఉంటూ ఆ తరువాత రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలంటూ సూచించారు. వారిని పూర్తిగా నమ్మిన రిటైర్డ్ ఎస్పీ 2023 మార్చి నుంచి జూన్, 2024 మధ్యలో రూ.14.70 కోట్లు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల కోసం వారు అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తూ వెళ్లాడు. జూలైలో తన సోదరి మృతి చెందిందని, తమ స్వగ్రామానికి వెళ్లి వస్తానంటూ రాకేశ్, అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులైన చంద్రకళ ఉప్పె, మాన్యం సందీప్, మాన్యం కమల్‌కుమార్, రాళ్లపల్లి వరలక్ష్మి, జి.నవ్య కిరణ్మయి తదితరులు అక్కడి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఫోను చేస్తే స్విచ్చాఫ్ వచ్చాయి. ట్రాప్ చేసి రాకేశ్ ముఠా తన వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిందని గుర్తించిన బాధితుడు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరువాత కేసు నమోదు చేసి సీసీఎస్‌కు బదిలీ చేశారు.
సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో 5 నుంచి 10 శాతం లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ ప్రభుత్వ ఉద్యోగికి రూ.13 లక్షలు టోకరా వేశారు. వాట్సాప్‌లో స్టాక్ ట్రైనింగ్ కోసం ‘ఏఓ02 ఆప్స్టాక్స్ సర్వీస్ గ్రూప్’ పేరుతో ఒక గ్రూప్‌ను తయారు చేసి వివిధ స్టాక్‌మార్కెట్లలో ట్రేడింగ్‌పై అవగాహన కల్పిస్తానంటూ నమ్మించాడు.
వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న వారు తమకు ఫలానా స్టాక్స్‌లో మంచి లాభాలొచ్చాయంటూ చర్చించుకుంటూ బాధితుడిని పరోక్షంగా ప్రేరేపించారు. ఈ క్రమంలోనే నకిలీ వెబ్సైట్ లింకును పంపించి అందులో షేర్స్ కొనాలంటూ సూచించాడు. మొదట లాభాలొస్తున్నాయంటూ నమ్మించి, ఆ తరువాత దఫాదఫాలుగా రూ. 13.7లక్షలు డిపాజిట్లు చేయించాడు. వెబ్సైట్లో లాభాలు స్క్రీన్‌పై కన్పించినా, వాటిని డ్రా చేసుకునే వీలు లేకపోవడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.