బంజారాహిల్స్, నవంబర్ 17: ప్రీ లాంచింగ్ ఆఫర్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ తమను మోసం చేసింది. చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. భారతీ బిల్డర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొంపల్లి పరిధిలో ఆరున్నర ఎకరాల్లో ప్రాజెక్ట్ చేపట్టింది. ప్రీ లాంచింగ్ ఆఫర్ కింద తక్కువ ధరకు ప్లాట్స్ అంటూ నమ్మించిన సంస్థ ప్రతినిధులు సుమారు 400 మంది వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. అయితే, నాలుగేండ్లు పూర్తయినా ప్రాజెక్టు పనులు ప్రారంభించకపోవడంతో సంస్థ ఉద్యోగులు గతంలోనే పలుమార్లు ఆందోళనకు దిగారు.
కాగా, బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్న సునీల్‌కుమార్ అహుజా అనే వ్యాపారి సంస్థలో పెట్టుబడి పెట్టానని, బాధితులకు న్యాయం చేస్తానని నమ్మబలికాడు. కొన్నాళ్ల తర్వాత భారతీ బిల్డర్స్ సంస్థను తన పేరుపై మార్చుకున్నాడు. అయితే, బాధితులకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధిస్తుండటంతో వీరంతా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదు చేశారు. నెలలు గడిచినా నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. డబ్బులు రాకపోవడంతో వారంతా ఆదివారం ఎమ్మెల్యే కాలనీలోని సునీల్ కుమార్ నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. సునీల్‌కుమార్ అహుజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.