అబిడ్స్, జూన్ 17: రేషన్ డీలర్ల కమీషన్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతుంది. జంట నగరాల్లో 653 రేషన్ షాపులు ఉండగా ఆరు లక్షల 47 వేల మంది కార్డుదారులకు రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు. సరుకులు పంపిణీ తర్వాత మరుసటి నెలలో రేషన్ డీలర్లకు చెందిన కమీషన్ సివిల్ సఫ్లై కార్పొరేషన్ వారి బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యేలా చూసేవారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్గా డీఎస్ చౌహాన్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న కమీషన్లను చెల్లించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతినెలా సకాలంలో డీలర్లకు చెందిన కమీషన్ వారి బ్యాంకు అకౌంటుల్లో జమ చేసేలా ఆదేశాలు జారీ చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వారు.
ఇదిలా ఉండగా మార్చి నెలకి సంబంధించిన డీలర్ల కమీషన్ బ్యాంకుల్లో జమ చేయగా ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన కమీషన్ను ఇప్పటి వరకు జమ చేయక పోవడంతో రేషన్ డీలర్లు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు నెలల కమీషన్ పెండిగ్లో ఉండగా జూన్ మాసంలో ఒకే సారి మూడు నెలల సరుకులను సరఫరా చేస్తున్నారు. మరో 12 రోజులు గడిస్తే రేషన్ డీలర్లకు మొత్తం ఐదు నెలలకు సంబంధించిన కమీషన్ను విడుదల చేయాల్సి ఉంటుంది.