సిటీ బ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో రేషన్ డీలర్లు అవస్థలు పడుతున్నారు. గ్రామ గ్రామాన ప్రజలు నిత్యవాసరాలు పంపిణీ చేస్తున్న డీలర్లకు వచ్చే కనీస వేతనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కమీషన్లను ఎప్పటికప్పుడు టంచనుగా అందజేసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డీలర్లు అరిగోస పడుతున్నారు. ఐదు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా డీలర్లకు అందాల్సిన కమీషన్ సర్కార్ నిలిపేసింది.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అందించాల్సిన కమీషన్లతో పాటు కేంద్రం నుంచి వస్తున్న వాటాను కూడా అడ్డుకుని రేషన్ డీలర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీంతో రోజుల తరబడిగా రేషన్ డీలర్లు రాష్ట్రంలోని అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ కార్యాలయాల్లో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకుండా పోతున్నది. మూడు నెలలుగా రేషన్ డీలర్లు రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టినా కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది.
దీంతో ఆగ్రహించిన డీలర్లు గురువారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. పౌరసరఫరాల అధికారులను కలిసి తమ సమస్యను విన్నవించారు. ప్రభుత్వం స్పందించి ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న తమ కమీషన్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు అనుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే సెప్టెంబర్‌లో రేషన్ పంపిణీ నిలిపేస్తామని హెచ్చరించారు.
అద్దె చెల్లించలేని దుస్థితి..
రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లకు అందాల్సిన ఐదు నెలల కమీషన్లను పౌర సరఫరాల శాఖ పెండింగ్‌లో ఉంచింది. ఐదు నెలలకు రూ.180 కోట్ల బకాయిలు ఉన్నాయని రేషన్ డీలర్లు చెప్తున్నారు. ఇందులో కొన్ని జిల్లాల్లో రాష్ట్రం నుంచి అందాల్సిన వాటాలో రెండు నెలల బకాయిలు మాత్రం చెల్లించారని చెబుతున్నారు. గడిచిన రెండేండ్లుగా గన్నీ సంచుల బకాయిలు రూ. 20 కోట్లు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తున్నదని రేషన్ డీలర్లు వాపోతున్నారు.
నెలల ఇండ్లను అద్దెకు తీసుకుని రేషన్ దుకాణాలు నిర్వహిస్తున్నామని, కమీషన్లు సకాలంలో చెల్లించకపోవడంతో అద్దె చెల్లించలేని దుస్థితి నెలకొందని వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం దుకాణాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని, వారంతా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ఇప్పటికైనా పెండింగ్‌లో ఉన్న తమ కమీషన్లను చెల్లించాలని వేడుకుంటున్నారు.
నెలల తరబడి పెండింగులా?
మేనిఫెస్టోలో డీలర్లపై హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొండి చేయి చూపిస్తున్నదని డీలర్లు ఆరోపిస్తున్నారు. ఒక క్వింటా బియ్యానికి ప్రస్తుతం రూ.140 కమీషన్ చెల్లిస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే దీన్ని రూ.300కు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అదే విధంగా రేషన్ డీలర్లకు గౌరవ వేతనంగా నెలకు రూ.5వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
ప్రజలకిచ్చిన అమలు కానీ హామీల్లానే తమనూ మోసం చేశారని రేషన్ డీలర్లు విమర్శిస్తున్నారు. కమీషన్లు, గన్నీ సంచుల బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలల నుంచి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 31 వరకు ప్రభుత్వం స్పందించాలలని, లేదంటే బియ్యం పంపిణీ నిలిపేసి చెబుతున్నారు.
డీలర్లపై వేధింపులు ఆపాలి
ప్రజలు, ప్రభుత్వానికి సంధానకర్తగా పనిచేస్తున్న రేషన్ డీలర్ల కమీషన్లు విడుదల చేయకుండా వేధించడం సరికాదు. నామమాత్రపు కమీషన్‌తో ఏండ్ల తరబడిగా రేషన్ దుకాణాలు నిర్వహిస్తున్నాం. సొంత భవనాలు లేకున్నా అద్దె భవనాల్లో దుకాణాలను నిర్వహిస్తున్నాం. ఐదు నెలలుగా కమీషన్లను పెండింగ్‌లో ఉంచడం వల్ల భవనాల అద్దెలు చెల్లించలేకపోతున్నాం. పెండింగ్‌లో ఉన్న కమీషన్లు విడుదల చేయాలని నెలల తరబడిగా ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నాం.
– నాయికోటి రాజు, రాష్ట్ర అధ్యక్షుడు