Hyderabad | బంజారాహిల్స్, మార్చి 7 : తండ్రితో కలిసి బైక్ మీద వెళ్తున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వారిని కొందరు మైనర్లు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన యూసుఫ్‌గూడ పెట్రోల్ బంక్ సమీపంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ సమీపంలోని సన్ సిటీ ప్రాంతంలో నివాసం ఉంటున్న మిస్బాహుద్దీన్ అనే వ్యక్తి గత నెల 21న రాత్రి 9.30 ప్రాంతంలో యూసుఫ్‌గూడ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కోసం ఆగాడు. అక్కడకు యాక్టివా బైక్ మీద వచ్చిన ముగ్గురు మైనర్లు నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. తన బైక్ వెనకసీట్లో కూర్చున్న తన కుమార్తె(19)ను చూస్తూ బూతులు మాట్లాడారు. దీంతో ఆ మైనర్లను మిస్బాహుద్దీన్ మందలించారు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి దాడికి యత్నించారు.
దీంతో పెట్రోల్ బంక్ సిబ్బంది జోక్యం చేసుకుని గొడవను ఆపారు. కాగా పెట్రోల్ బంక్ నుంచి బయలుదేరిన మిస్బాహుద్దీన్ బైక్‌ను వెంబడిస్తూ జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 దాకా వచ్చిన మైనర్లు అసభ్యకరమైన మాటలతో పాటు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ యాక్టివాను బైక్‌తో డీకొట్టేందుకు యత్నించారు. ఈ మేరకు శుక్రవారం బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.