బన్సీలాల్‌పేట్, నవంబర్ 20: గాంధీ దవాఖానలో తొలిసారిగా ఏడేండ్ల బాలుడికి లాపరోస్కోపిక్ స్ప్లీనెక్టమి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామని పీడియాట్రిక్ సర్జరీ విభాగం హెచ్ఓడీ, ప్రొఫెసర్ కె.నాగార్జున తెలిపారు. వరంగల్ జిల్లాలోని అక్నేపల్లి గ్రామానికి చెందిన రవి సూరా కుమారుడు అఖిల్‌కు మూడు నెలల వయస్సు నుండే హెరిడిటరీ స్పేరోసైటోసిస్ అనే వ్యాధి నిర్ధారణ అయ్యిందన్నారు. కామెర్లు, రక్తహీనతతో బాలుడికి ప్రతి వారం రక్తమార్పిడి అవసరం అవుతున్నదని వరంగల్‌లోని ఎంజీఎం వైద్యులు బాలుడిని గాంధీ దవాఖానకు సిఫారసు చేశారని తెలిపారు. కిలో బరువు గల ప్లీహాన్ని నాలుగు చిన్న రంధ్రాల ద్వారా లాపరోస్కోపిక్ పద్ధతిలో తొలగించామన్నారు.
ప్రస్తుతం బాలుడు కోలుకున్నాడని, బుధవారం డిశ్చార్జి చేశామని చెప్పారు. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.వాణి మాట్లాడుతూ.. ఇలాంటి అరుదైన ఆపరేషన్‌కు ప్రైవేట్ దవాఖానల్లో లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. తమ దవాఖానలోని సీనియర్ పీడియాట్రిక్ సర్జరీ డాక్టర్లు సమష్టిగా కృషి చేసి, క్లిష్టమైన ఈ సర్జరీని అధునాతన పద్ధతిలో, సురక్షితంగా నిర్వహించడంపై ఆమె వైద్యులను అభినందించారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్లు మనోజ్‌కుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి, పవన్‌రావు, ఆశ్రిత్ రెడ్డి, హర్ష, సాజిద్, అనస్థీషియా ప్రొఫెసర్ డాక్టర్ మురళీధర్, డాక్టర్ బబిత, నర్సింగ్ ఆఫీసర్లు, ఓటీ సిబ్బంది పాల్గొన్నారు.