‘పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు ఉద్యోగ సాధనే ధ్యేయంగా ప్రయత్నించాలి.. ఒక లక్ష్యం నిర్ణయించుకొని పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధ్యం’ అని ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ‘కొలువు-గెలువు’ సదస్సులో వక్తలు పిలుపునిచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి 1200మందికిపైగా అభ్యర్థులు వచ్చారు. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత, వేప అకాడమీ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప విలువైన సలహాలు ఇచ్చి, సందేహాలను నివృత్తి చేశారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా మంత్రి హరీశ్‌రావు, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, ఆత్మీయ అతిథులుగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సేన్, యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ హాజరయ్యారు. సివిల్ ర్యాంకర్లు అఖిల్, శ్రీధర్ పాల్గొని, వారి అనుభవాలను అభ్యర్థులతో పంచుకున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సదస్సు మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగగా, కార్యక్రమానికి ప్రధాన వ్యాఖ్యాతగా ఎజాస్ అహ్మద్ వ్యవహరించారు.
చిత్తశుద్ధ్దితో చదివి లక్ష్య సిద్ధిని సాధించాలి..
నాడు తెలంగాణ ఉద్యమంలో ‘నమస్తే తెలంగాణ’ ప్రజలను జాగృతం చేసింది. తెలంగాణకు జరుగతున్న వివక్ష, అన్యాయాలను ప్రజల ముందుంచి ఉద్యమం వైపు కార్యోన్ముఖులను చేసింది. నేడు యువతలో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కల్పించి ఉద్యోగం సాధించడంలో భాగంగా జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తూ తన వంతు పాత్ర పోషిస్తున్నది. నమస్తే తెలంగాణ దినపత్రికకు ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఐఏఎస్ ఉద్యోగం సాధించి, ఉద్యోగంలో చేరకుండా తన లాగా తెలంగాణ నుంచి ఎంతో మంది ఐఏఎస్‌లను తయారు చేయాలని పూనుకున్న బాలలత అద్భుతమైన శిక్షణ ఇస్తున్నారు. ఈ ఏడాది తన దగ్గర శిక్షణ తీసుకున్న 15మంది సివిల్స్ ర్యాంకులు సాధించారు. 27వేల మందికి శిక్షణ ఇచ్చి డాక్టర్ వేప ఎంతోమందిని అధికారులుగా తయారు చేశారు. అభ్యర్థులు చిత్తశుద్ధితో ప్రయత్నించి లక్ష్యాన్ని సాధించాలి. కొన్ని రోజులు సోషల్ మీడియాకు, ఇతరత్రా తాత్కాలిక ఆనందాలను పక్కనబెట్టి.. దీర్ఘకాలిక ఆనందాల కోసం ప్రయత్నించాలి. మీరు ఉద్యోగాలు సాధిస్తే.. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కండల్లో ఆనందం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా ప్రైవేట్‌లోనూ అనేక అవకాశాలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలి.
– తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి
నాలుగు అంశాలపై దృష్టిపెట్టాలి
కృషి, పట్టుదలతో పాటు ప్రణాళికాబద్ధ్దంగా ప్రయత్నిస్తే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంతో సులువు. పోటీ పరీక్షల అభ్యర్థులు ప్రధానంగా నాలుగు అంశాలైన ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ అంశాలపై దృష్టిసారించాలి. సమకాలిన అంశాలు, తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్ర, తెలంగాణ సాధన అనంతరం తీరుతెన్నులపై ఫోకస్ చేయాలి. తెలంగాణ ఆర్థిక, సామాజిక అంశాలు, పరిశ్రమల నిర్వహణ, పెట్టుబడులు, విమానయానం, మెట్రో, టెక్స్టైల్స్, ఐటీ రంగం అభివృద్ధి, భౌగోళిక స్వరూపం, 33జిల్లాల చరిత్రపై పట్టు సాధించాలి. కనీసం రోజుకు 50 పాత ప్రశ్నాపత్రాలను చదవాలి. 6నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, తెలంగాణ మాసపత్రిక, ఎన్సీఆర్టీ, తెలుగు అకాడమీ, వివిధ దినపత్రికలను నిత్యం ఫాలో అయితే అన్ని విషయాలపై అవగాహన వస్తుంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వారు చేస్తున్న కృషి అభినందనీయం.
– సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత వల్లవరపు
ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి..
పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వారు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అకడమిక్ పరీక్షలు, పోటీ పరీక్షలు వేరు అన్న విషయాన్ని గుర్తించాలి. రోజువారీగా ఎన్ని గంటలు చదవాలో నిర్ణయించుకోవాలి. పరీక్షలో సక్సెస్ కావాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. ఎన్ని పనులున్నా చదువును వాయిదా వేయవద్దు. సమాచారం కోసం తప్ప సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేయవద్దు. టైం మేనేజ్మెంట్ పాటించాలి. ప్రణాళికా ప్రకారం ప్రిపరేషన్ సాగిస్తే మొత్తం సిలబస్‌ను పూర్తి చేయవచ్చు. టైమింగ్, రైటింగ్, స్పీడ్ రీడింగ్‌తో సక్సెస్ సాధ్యం. చదువుతున్న అంశానికి సంబంధించిన దృశ్య రూపాన్ని చూసే ప్రయత్నం చేస్తే, ఆ అంశం ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ప్రతి గంటలో 50 నిమిషాలు చదవడం, ఐదు నిమిషాల పాటు రివిజన్ చేసుకోవడం, మరో ఐదు నిమిషాలు మెదడుకు విశ్రాంతినివ్వాలి.
-డాక్టర్ సీఎస్ వేప, వేప అకాడమీ డైరెక్టర్ హైదరాబాద్
ఎలా చదవాలో తెలిసింది..
గ్రూప్-1,2పరీక్షలను రాసే వారు బట్టీపట్టి చదవడం మానుకోవాలనే విషయం తెలుసుకున్నా. బట్టీ పడితే, నేర్చుకున్నవి మర్చిపోయి, ఉద్యోగం చేజారే ప్రమాదముంటుంది. అవగాహనతో చదవాలనే అంశాలను ఇక్కడ నేను నేర్చుకున్నా. మా కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ‘నమస్తే తెలంగాణ’, మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– సానేటి సబిత, సర్పంచ్, లెనిన్‌నగర్, కొమురవెల్లి మండలం
ఆత్మన్యూనతను వీడాలి..
గ్రామీణ పాంతం నుంచి వచ్చామని, పేదరికంలో ఉన్నామని, పట్టణ ప్రాంతాల వారితో పోటీపడి ఉద్యోగం సాధిస్తామో లేదోననే ఆత్మన్యూనతా భావాన్ని అభ్యర్థులు వీడాలి. లక్ష్య సాధనే ధ్యేయంగా ప్రయత్నిస్తే విజయం తథ్యం. మొదటి అడుగు తడబడినా వెనుకంజ వేయవద్దు. రోజువారీగా మాక్ టెస్ట్‌లు రాయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. చదవడమే కాకుండా రివిజన్ చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. ప్రామాణిక పుస్తకాలు మాత్రమే చదవాలి. రోజూవారీ షెడ్యూల్ తప్పనిసరిగా అమలు చేయాలి.
– అఖిల్, 2022 సివిల్స్ ర్యాంకర్(సిద్దిపేట)
ఇష్టపడి చదవాలి..
కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే విజయం సాధించవచ్చు.రీడ్, రివైజ్, టెస్ట్ పద్ధతిని ఫాలో కావాలి. పరీక్ష రాసే విధానంలో మెలకువలు తెలుసుకోవాలి. పోటీ పరీక్షలకు గైడెన్స్ ముఖ్యం. నిపుణుల సూచనలు తప్పక పాటించాలి. అన్ని అంశాలపై పట్టు సాధించాలి. దీర్ఘకాలిక ప్రణాళికలు పోటీ పరీక్షల్లో విజయానికి ఎంతగానో దోహద పడతాయి.
– శ్రీధర్, 2022 సివిల్స్ ర్యాంకర్ (కరీంనగర్)
అయోమయాన్ని తొలిగించారు
నేను సివిల్స్ పరీక్షలకు ప్రిపేరవుతున్నా. ఏ సబ్జెక్ట్ నుంచి మొదలు పెట్టాలో.. ఏ విధంగా ప్రయత్నించాలో తెలియక అయోమయంలో ఉన్నవారికి ఈ సదస్సులో బాలలత మేడం చక్క గా వివరించారు. ఆమె క్లాస్ వినేందుకు అవకాశం కల్పించిన ‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు. సివిల్స్ ర్యాంకర్లు మాటలు మాలో స్ఫూర్తిని నింపాయి.
– బి.వెంకటేశ్, గుర్రాలగొంది
సదస్సుతో మేలు జరిగింది..
‘నమస్తే తెలంగాణ’ సదస్సుతో నాకు మేలు జరుగుతుందని భావిస్తున్నా. ఇక్కడ నిపుణులు సూచించిన ప్రకారం చదివితే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడం సులువుగా ఉంటుంది. మేడం బాలలత, వేప సార్ చెప్పిన అంశాలు చాలా బాగున్నాయి. వారి సూచనలు పాటించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతా.
– సాయి సమహిత, సిద్దిపేట