రంగారెడ్డి, ఏప్రిల్ 28 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డిజిల్లా విద్యాశాఖ కార్యాలయం అక్రమాలకు కేరాఫ్‌గా మారింది. బదిలీలు, అనుకూలమైన చోటుకు వెళ్లేందుకు అధ్యాపకులు అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. జిల్లాలో అనుకూలమైన పోస్టులు లేకున్నా.. అధికారుల అండదండలతో ఇతర జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు జిల్లాలోకి వచ్చి చేరుతున్నారు. వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు నిబంధనలు అడ్డొస్తున్నా.. విద్యాశాఖ అధికారులు యధేచ్ఛగా బదిలీలు చేస్తున్నారు. బదిలీ అయిన పాఠశాలల్లో ఆయా సబ్జెక్టుల పోస్టులు ఖాళీ లేకపోవటంతో వేతనాలు చెల్లించడంలో గందరగోళం నెలకొంది.
స్పౌజ్ కేటాయింపులో..
ప్రభుత్వం నియమించిన 317 జీవో కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు మేరకు రంగారెడ్డి జిల్లా స్పౌజ్ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. తలకొండపల్లి మండలంలో జడ్పీహెచ్ఎస్ పడకల్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిషులో పనిచేస్తున్న వారి స్పౌజ్ కేటాయింపు నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిషును కౌన్సిలింగ్ ద్వారా అదే మండలంలో జడ్పీహెచ్ఎస్ ఖానాపూర్ పాఠశాలకు మొదటగా కేటాయించారు. కానీ వారు విధుల్లో చేరలేదు.
ఆ పాఠశాలలో ఒకే ఇంగ్లిషు పోస్టున్నప్పటికీ వారికి 24 శాతం హెచ్ఆర్ఏ ప్రాంతమైన సరూర్‌నగర్ మండలంలోని జడ్పీఎచ్ఎస్ రాజీవ్గాందీనగర్ పాఠశాలకు 20 రోజుల తర్వాత కేటాయించారు. వీరికి కూడా రీ కౌన్సిలింగ్ తర్వాత తలకొండపల్లి మండలం ఖానాపూర్ జిల్లా పరిషత్‌కు కేటాయించాలి..కానీ కేటాయించకుండా అదే స్థానం రాజీవ్గాంధీనగర్లోనే కొనసాగిస్తున్నారు. ఇది పూర్తిగా స్పౌజ్ నిబంధనలకు విరుద్ధం.
తప్పుల తడకగా సీనియారిటీ లిస్టు
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం జడ్పీఎచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఖాళీ పోస్టులు లేవు. అయినా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిషు, సోషల్ రెండు స్పౌజ్ పోస్టుల్లోనూ ఇచ్చారు. వారిలో ఒక్కరిని స్పౌస్ కింద కడ్తాల్ మండలంలోని జడ్పీఎచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడి స్పౌస్‌ను అదే కడ్తాల్ మండలంలో ఏదో ఒక్క పాఠశాలలో కేటాయించాలి. కానీ.. పోస్టులు లేని తొర్రూరు పాఠశాలలో 24 శాతం హెచ్ఆర్ఏను నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిషు టీచర్‌ను కేటాయించారు.
స్పౌస్లో భాగంగా మరో ఉపాధ్యాయురాలు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి పోస్టులు లేని తొర్రూరు పాఠశాలకు కేటాయించారు. రీ కౌన్సిలింగ్ ద్వారా జడ్పీహెచ్ఎస్ తారామతిపేటకు కేటాయించారు. శేరిగూడ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ పోస్టులు లేకున్నా నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి స్పౌస్ కేటాయింపులో శేరిగూడ పాఠశాలకు.. రీ కౌన్సిలింగ్ ద్వారా ఓ ఉపాధ్యాయున్ని కప్పాడుకు కేటాయించారు.
పద్మశాలి పురంలో ఓ ఉపాధ్యాయుడు ఈనెలలో రిటైర్డ్ అవుతున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా జీవో 317 అమలు సమయంలో ఇతను జడ్పీహెచ్ఎస్ ఆకుతోటపల్లిలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఆ ఉపాధ్యాయుడిని సీనియారిటీ లిస్టులో నాగర్‌కర్నూల్ జిల్లాకు కేటాయించారు. నిబంధనలకు విరుద్ధంగా అతన్ని వికారాబాద్ జిల్లాకు బదిలీ చేశారు. ఈ విషయంపై సేవ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకునే నాథుడే లేడు.
మితిమీరిన రాజకీయ జోక్యంతో..
రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీ విషయంలో మితిమీరిన రాజకీయ జోక్యం, డబ్బుల ప్రలోబాలు పెద్ద ఎత్తున తెరమీదకు వస్తున్నాయి. ముఖ్యంగా 317 జీవోను అడ్డం పెట్టుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పెద్దఎత్తున రంగారెడ్డి జిల్లాకు బదిలీపై వస్తున్నారు. వీరి బదిలీల్లో తెరవెనుక అధికార పార్టీకి చెందిన బ్రదర్స్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ఆయా పోస్టులు లేకున్నా.. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి జిల్లా విద్యాశాఖ అధికారులు వారిని చేర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విచారణ జరిపించాలి
రంగారెడ్డి జిల్లా విద్యాశాఖలో బదిలీల భాగోతంపై పారదర్శకంగా విచారణ జరిపించాలి. రంగారెడ్డి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. ఇతర జిల్లాల నుంచి 317 జీవోను అడ్డుపెట్టుకుని జిల్లాకు రావడంతో పాటు సీనియారిటీ పేరుతో హెచ్ఆర్ఏ ప్రాంతాలకు వస్తున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు.
– బొడ్డు రవి, సేవ్ టీచర్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు