Drugs | రంగారెడ్డి, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రభుత్వం, పోలీసు శాఖ, యువత, సమాజంలోని అన్ని వర్గాలు సమష్టిగా కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుకుగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఫ్యాబ్ సిటీ ఆవరణలో జిల్లా పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, మెడికల్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వాక్‌థాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శశాంక, రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజానికి పట్టిన చీడపురుగు వంటి డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరముందన్నారు. డ్రగ్స్ వినియోగం దుష్ప్రభావాల గురించి యువతకు పరిజ్ఞానం కల్పించేందుకు సోషల్ మీడియాతోపాటు కళాశాలల్లో రాచకొండ కమిషనరేట్ ద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ మత్తు పదార్థాల బారిన పడటం వల్ల యువత బంగారు భవిష్యత్ నాశనమవుతుందన్నారు.
కార్యక్రమానికి ముందు కలెక్టర్ శశాంక, రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వాక్‌థాన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులతో నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో డీసీపీ మహేశ్వరం సునీత రెడ్డి, కందుకూర్ ఆర్డీఓ సూరజ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మజా రమణ, డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు, డీసీపీ ఉషా విశ్వనాథ్, ఏసీపీ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.