మన్సూరాబాద్, ఆగస్టు 1: సంవత్సరాల క్రితం గతంలో ఎప్పుడో నిర్మించిన పురాతన నిర్మాణాల జోలికి హైడ్రా వెళ్లదని హైడ్రా కమీషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. మన్సూరాబాద్ డివిజన్ విజయవాడ జాతీయ రహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా చింతలకుంట ఆగమయ్యకాలనీలో జరుగుతున్న వరద కాలువ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం వివేకానందనగర్ కాలనీ నుంచి వచ్చిన పలు ఫిర్యాదుల మేరకు కాలనీలో పర్యటించారు. రోడ్ల ఆక్రమణపై ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా హైడ్రా ఆయన మాట్లాడుతూ కాలనీవాసుల నుంచి వచ్చి ఫిర్యాదుల మేరకు వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం స్వయంగా నిజనిర్ధారణ చేసి తదుపరి చర్యలు తీసుకుం టామన్నారు. కాలనీ ఏర్పడి సమయంలోని లే అవుట్‌తో సంబంధిత డాక్యుమెంట్లను హైడ్రా కార్యాలయంలో అందజేయాలని కాలనీవాసులకు ఆయన సూచించారు. కాలనీలో ఇరుగు పొరుగు వారితో ఉన్న అంతర్గత గొడవల కారణంగా ఒకరిపై మరొకరు చేసిన ఫిర్యాదులు, గట్టు, గేటు పంచాయితీలను హైడ్రా వద్దకు తీసుకువస్తే స్పందించమని తెలిపారు. కాలనీలో కొన్ని రోడ్లు ఆక్రమణకు గురయ్యాయని, ప్లాట్లు ఓవర్ లాప్స్ అయ్యాయని హైడ్రా కమీషనర్ దృష్టికి కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో హైడ్రా డీసీపీ అశోక్‌కుమార్, ఏసీపీ తిరుమల్, జీహెచ్ఎంసీ హయత్‌నగర్ సర్కిల్ ఏసీపీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.