సిటీబ్యూరో, మే10 ( నమస్తే తెలంగాణ) : దేశంలో చాలామందిని ప్రభావితం చేస్తున్న సిస్టమెటిక్ లూపస్ ఎరిథమటోసస్ (ఎస్.ఎల్.ఈ) వ్యాధి విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని కిమ్స్ వైద్య నిపుణులు సూచించారు. సరైన సమయానికి చికిత్స తీసుకుంటే దీని లక్షణాలన్నింటి నుంచి ఉపశమనం లభిస్తుందని, నిర్లక్ష్యం చేసినా, వైద్యుల వద్దకు వెళ్లడానికి ఆలస్యం చేసినా ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుందని తెలిపారు.
అంతర్జాతీయ లూపస్ డే సందర్భంగా శనివారం కిమ్స్ ఆస్పత్రిలో లూపస్ వ్యాధితో పోరాడుతున్న వారితో వినూత్నంగా ర్యాంప్ వాక్ నిర్వహించారు. సుమారు 40 మంది యోధులు ర్యాంప్ వాక్ చేసి, తమ ఆత్మవిశ్వాసాన్ని, వ్యాధిని జయించగలమన్న నమ్మకాన్ని ప్రదర్శించారు. ఆసియాలో ర్యాంప్ వాక్ నిర్వహించడం ఇది నాలుగోసారి. లూపస్ ఉందని చెప్పుకోవడానికే ఒకప్పుడు చాలా ఇబ్బంది పడేవారు.
దాన్నుంచి, ఇప్పుడు మహిళలు నేరుగా ఆస్పత్రికి వచ్చి.. ఇక్కడ ర్యాంపుపై మోడళ్లలా ర్యాంప్ వాక్ చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీ భాస్కర్ రావు, అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా (ఏ.పీ.ఐ.) ప్రెసిడెంట్ డాక్టర్ జి.నర్సింహులు, గౌరవ అతిథులుగా ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ డి.రాజ్‌కిరణ్, రుమటాలజీ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు డాక్టర్ ఐ.రాజేంద్ర వరప్రసాద్ పాల్గొన్నారు.
గుర్తించడం ఎలా..?
విపరీతమైన నీరసం, అలసట, జ్వరం, బరువు తగ్గడం, శరీరంపై దద్దుర్లు, ఎండలో వెళ్లినప్పుడు ముఖంపై ఎర్రగా దద్దుర్లు రావడం, జుట్టు రాలడం, ఆర్థరైటిస్, మూత్రంలో ప్రొటీన్ పోవడం, మూత్రంలో రక్తం పడటం, త్వరగా మర్చిపోవడం, రక్తహీనత, తెల్ల రక్తకణాలు లేదా ప్లేట్లెట్లు తగ్గడం, తరచు గర్భస్రావాలు కావడం, లేదా తరచు నోట్లో పుళ్లు రావడం లక్షణాలుంటే లూపస్ అంటారు. ఇలాంటి లక్షణాలు కనిపించిన తొలిదశలోనే రుమటాలజిస్టును సంప్రదిస్తే దీన్ని పూర్తిగా నయం చేయగలం. ఆధునిక వైద్యవిధానాల్లో లూపస్ రోగులకు అత్యుత్తమ చికిత్స అందుబాటులో ఉంటోంది. మన దేశంలో 20వేల మంది వరకు రుమటాలజిస్టులు అవసరం ఉండగా, కేవలం 800 మంది మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం.
మహిళల్లోనే ఎక్కువగా సోకుతోంది
మన దేశంలో లూపస్ తీవ్రత ఎక్కువగానే ఉన్నా, ఎంతమందికి వస్తోందన్న అధికారిక లెక్కలు లేవు. మా వద్దకు రోజూ సుమారు 80-90 మందిలో 20-25 మంది లూపస్ వ్యాధితో పోరాడేవారే ఉంటున్నారు. ప్రాంతాల వారీగా ఇది వేర్వేరుగా ఉంటోంది. పాశ్చాత్య దేశాల్లో ప్రతి లక్ష మందిలో 20-150 మందికి ఇది ఉంటోంది. ఈ వ్యాధితో పోరాడుతున్న వారిలో 90% మంది మహిళలే ఉండటం మరో బాధాకరమైన విషయం. సాధారణంగా 15-45 ఏళ్ల మధ్య వయసు (పునరుత్పత్తి దశ)లోనే ఇది వస్తుంది. వ్యాధి లక్షణాలు కన్పించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– డాక్టర్ శరత్ చంద్ర మౌళి, రుమటాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్, కిమ్స్