మైలార్‌దేవ్‌పల్లి,ఫిబ్రవరి11: చెరువుల్లో మట్టి పోసి కబ్జాకు పాల్పడే వారిని సహించమని రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్‌గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్ ,మార్కండేయనగర్ ,సాయిబాబానగర్ కాలనీకి ఆనుకొని ఉన్న నర్సాబాయి కుంటను కబ్జా చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు సందర్శించారు. 2016లో నర్సాబాయి కుంటను పార్కు చేయడానికి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ రూ. కోటి 22లక్షలు నిధులు మంజూరు చేయించారని స్థానికులు తహసీల్దార్‌కు వివరించారు. పార్కు కోసం చుట్టూ ఫెన్సింగ్ వేసి వాకింగ్ ట్రాక్ వేసి కాంట్రాక్టర్ వదిలేశారన్నారు. పార్కు స్థలంలో మురుగు నీరు పారుతుండటంతో స్థానికులు పార్కును చదును చేయుటకు మట్టిని పోయిస్తున్నామని తెలిపారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీఏ వారి అనుమతితో పార్కు అభివృద్ధికి మట్టి పోసి పార్కును చదును చేయించుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా ఎవరైనా స్థానికులు మట్టి పోసి చదును చేయిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ సారిక, వీఆర్ఏ జంగయ్య, మధుగౌడ్, మల్లేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు.