శంషాబాద్ రూరల్, డిసెంబర్ 24: నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రకాశ్ గౌడ్‌ను ఆదివారం శంషాబాద్ పట్టణంలోని పలువురు ముదిరాజ్ నాయకులు ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని 15 ఏండ్లుగా అభివృద్ధి చేశానని.. మరింత అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రభుత్వం లేకపోయిన నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు తీసుకువచ్చి పని చేస్తానని చెప్పారు. తనకు అండగా ఉండి గెలిపించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని తెలిపారు. కార్యక్రమంలో శంషాబాద్ ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.