కాచిగూడ, ఏప్రిల్ 2: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం కల్పించిన రిజర్వేషన్లకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించి, చట్టబద్ధత కల్పించాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ మహాసభ ఆధ్వర్యంలో పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. బుధవారం రాష్ట్ర నాయకులతో రాజేందర్ పటేల్ గౌడ్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీల బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. బీసీల బతుకులు బాగుపడాలంటే అందుకు బీసీలు సంఘటితమై ఉద్ధమించాల్సిన సమయం ఆసన్న మైందన్నారు. బీసీల హక్కుల కోసం ప్రతి బీసీ బిడ్డ కేంద్ర ప్రభుత్వంపై ఐక్యంగా పోరాడినప్పుడే విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్.ప్రశాంత్ నీమ్ కర్, భూషణ్ భాస్కర్, ప్రదీప్ గౌడ్, పి.కృష్ణ, ముత్యాలరావు, రాజేష్ జైస్వాల్, తదితరులు పాల్గొన్నారు.