Raj Bhavan | ఖైరతాబాద్, మే 20 : రాజ్‌భవన్‌లో హార్డ్ డిస్క్ మాయం కేసులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రాజ్‌భవన్‌లో పనిచేసే ఉద్యోగే హార్డ్ డిస్క్‌ను దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సహోద్యోగిని ఫొటోలు అసభ్యంగా మార్ఫింగ్ చేసి, అధికారులకు చిక్కడంతో ఇటీవల ఓ వ్యక్తిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీంతో తన తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో ఏకంగా హార్డ్ డిస్క్నే మాయం చేశాడు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా రాజ్‌భవన్ అధికార యంత్రాంగం జాగ్రత్త పడటంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. రాజ్‌భవన్‌లోని ఐటీ సెల్ విభాగంలో టి.శ్రీనివాస్ అనే వ్యక్తి హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 10వ తేదీన ఓ మహిళా ఉద్యోగిని ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారని అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరపి మార్ఫింగ్ చేసింది శ్రీనివాస్ అని అధికారులు గుర్తించారు. దీనిపై ఈ నెల 12వ తేదీ ఐటీ మేనేజర్ ఎన్.రాకేశ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పంజాగుట్ట పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శాఖాపరమైన చర్యల్లో భాగంగా అతన్ని విధుల్లో నుంచి సస్పెండ్ చేశారు. అయితే రెండు రోజుల్లోనే శ్రీనివాస్ బెయిల్‌పై బయటకు వచ్చాడు.
ఇదిలా ఉండగా, ఈ నెల 15వ తేదీ సాయంత్రం రాజ్‌భవన్‌లో ఐటీ సెల్ విభాగంలో నెట్వర్క్ ఇంజనీర్‌గా పనిచేసే వ్యక్తి కంప్యూటర్లు, సర్వర్లు ఉండే గదిలోకి వెళ్లాడు. అక్కడ అతను ఓ కంప్యూటర్ ఆన్ అయి ఉండటాన్ని గమనించాడు. వెంటనే దాన్ని పరీక్షించగా హార్డ్ డిస్క్ మార్చినట్లు తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని ఐటీ సెల్ మేనేజర్ రాకేశ్ సాయంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చాడు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా, ఈ నెల 14న రాత్రి 10 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ అనధికారికంగా రాజ్‌భవన్‌లోని ఐటీసెల్ విభాగంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఆ సమయంలో అతను హెల్మెట్ ధరించి ఉన్నాడు. దీనిపై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. నిందితుడిపై 305(ఎ), 316(5), 331(4) బీఎన్ఎస్ ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేశారు.