సిటీబ్యూరో, నవంబర్ 2(నమస్తే తెలంగాణ) : మహానగరంలో శరవేగంగా విస్తరిస్తున్న హైరైజ్ కల్చర్‌కు అనువైన నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతికతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లుగా క్రెడాయ్ హైదరాబాద్ నూతన అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. రెండేళ్ల పాటు కొనసాగేలా ఆయన నాయకత్వంలో నూతన నాయకత్వం కొలువుదీరింది. హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని కొంగొత్త రీతిలో అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని నూతన కార్యవర్గం తెలిపింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యరీతిలో అభివృద్ధి చెందింది. రెసిడెన్షియల్, ఆఫీస్ స్పేస్, లగ్జరీ హౌజింగ్ విభాగాల్లో దూసుకుపోతుంది. 9నెలల కాలంలో లగ్జరీ హౌజింగ్‌లో 260శాతం వృద్ధి నమోదు కాగా, మూడో త్రైమాసికంలో 2.9 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలతో నగరం దేశంలోనే అత్యధిక కొత్త కార్యాలయాలను ఆకర్షించింది. తాజా వృద్ధి, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, వేర్ హౌజింగ్ రంగాల్లో గణనీయమైన అభివృద్ధికి ఆస్కారం ఉందన్నారు. రియల్ ఎస్టేట్ రంగం దినాదినాభివృద్ధి చెందుతూ.. రాష్ర్టానికి ప్రధాన వృద్ధి ఇంజన్‌గా మారుతుందన్నారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారిస్తామని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గ్రీన్ బిల్డింగ్ విధానాలను అమలుపై నూతన కమిటీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. దీనికి అవసరమైన నైపుణ్యాలపై బిల్డర్లు, డెవలపర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు.
నూతన కార్యవర్గం..
క్రెడాయ్ హైదరాబాద్ నూతన కార్యవర్గం ఉపాధ్యక్షులుగా బి.ప్రదీప్ రెడ్డి, సీజీ మురళీమోహన్, కొత్తపల్లి రాంబాబు, ఎం.శ్రీకాంత్ కొనసాగనున్నారు. కోశాధికారిగా మనోజ్ కుమార్ అగర్వాల్, సంయుక్త కార్యదర్శులుగా నితీశ్ రెడ్డి, కాంత్రికిరణ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ఎ.వెంకట్ రెడ్డి, బి.జైపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ భన్సల్, సి.అమరేందర్ రెడ్డి, సుశీల్ కుమార్ జైన్, మోరిశెట్టి శ్రీనివాస్, ముసునూర్ శ్రీరాం, ఎన్.వంశీధర్ రెడ్డి ఎన్నికయ్యారు.