లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు
సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది
కూలిన చెట్లు.. తెగిపోయిన విద్యుత్ తీగలు
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించిన విద్యుత్ అధికారులు
బేగంపేట్/జూబ్లీహిల్స్/బన్సీలాల్‌పేట్/అమీర్‌పేట్, జూలై 13 : ఐదు రోజులుగా ఉపరితల ప్రభావంతో ముసురు వీడటంలేదు. దీంతో బేగంపేట్ సర్కిల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను నిత్యం జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. దీంతో బేగంపేట్, రాంగోపాల్‌పేట్ కార్పొరేటర్స్ మహేశ్వరి, చీర సుచిత్ర నిత్యం డివిజన్లలో పర్యటిస్తూ వర్షం నీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు సూచిస్తుండటంతోపాటు జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు అలర్టు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిల్వకుండా నాలాల్లోకి నీటిని మళ్లిస్తున్నారు. బుధవారం జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి ప్రధానంగా బేగంపేట్‌లోని మయూరియార్గ్, అల్లంతోట బావి, ప్రకాశ్‌నగర్, ఎక్స్టెన్షన్, బ్రాహ్మణవాడి ప్రాంతాల్లో ప్రజలను కలిసి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
కూలిన చెట్లు..తప్పిన ప్రమాదం
జూబ్లీహిల్స్ : వర్షాలకు చెట్టు కూలి విద్యుత్ తీగలపై పడటంతో తీగలు తెగి పెనుప్రమాదం తప్పింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. బుధవారం యూసుఫ్‌గూడ డివిజన్ ప్రగతినగర్ కాలనీలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు భారీ వృక్షం నేలకొరిగింది. కృష్ణానగర్. ప్రగతినగర్, అక్బర్ ఫామ్ ఏరియాల్లో 3 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తక్షణమే స్పందించిన విద్యుత్‌శాఖ అధికారులు చెట్టును.. కొమ్మలను యుద్ధప్రాతిపదికన తొలగించి, విద్యుత్ తీగల మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారు. డీఈ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడీఈలు ప్రవీణ్, శ్రీనివాస్‌లు పనులను పర్యవేక్షించారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రమాదం జరుగకుండా చూడటమేకాక వేగంగా పనులు చేపట్టి విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగకుండా చూడటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
బోయిగూడలో..
బన్సీలాల్‌పేట్ : న్యూబోయిగూడలోని జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయం వద్ద బుధవారం ఉదయం భారీ చెట్టు వేళ్లతో సహా కూలి విద్యుత్ స్తంభంపై పడింది. సిమెంట్ స్తంభం విరిగి వైర్లపై పడటంతో చుట్టుపక్కల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది కొమ్మలను తొలగించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నూతన స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, వార్డు కమిటీ సభ్యుడు బి.జ్ఞాని తెలిపారు.
కలుషిత నీటి నివారణకు చర్యలు
కలుషిత నీటి నివారణకు జలమండలి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలతో పలుచోట్ల తాగునీరు కలుషితమవుతుందన్న ఫిర్యాదులు వస్తుండటంతో అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టారు. బుధవారం జలమండలి సీజీఎం ప్రభు, డివిజన్-6 జీఎం ఎస్.హరిశంకర్‌తో కలిసి ఎల్లారెడ్డిగూడ సెక్షన్ పరిధిలోని యూసుఫ్‌గూడ డివిజన్లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మేనేజర్ మమత, సిబ్బంది పాల్గొన్నారు. – జూబ్లీహిల్స్, జూలై 13