Hyderabad | సిటీబ్యూరో/మేడ్చల్: గ్రేటర్లో వాన కష్టాలు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులకు 32 ఉప్పొంగి నాలాల్లోకి వరద పోటెత్తుతుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 51 చోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు ఆలస్యం కావడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలస్యంగా స్పందించి 47 చోట్ల ఫిర్యాదులను పరిష్కరించారు.
పలు చోట్ల వర్షాలతో మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి. మురుగు నీరు రహదారులపై ఏరులై పారింది. బల్దియా సిబ్బంది అలసత్వంతో ప్రజలు అవస్థలుపడుతున్నారు. ఇక మాదాపూర్‌లో గౌతమి ఎన్క్లేవ్, అంజనా హైట్స్ చెంత తవ్వి ఉంచిన సెల్లార్ ప్రహరీ గోడ కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాప్రాయం తప్పింది. కాగా, హుస్సేన్‌సాగర్‌కు 2811 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా..దిగువ మూసీలోకి 2255 క్యూసెక్కులను వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం క్షేత్రస్థాయిలో రెండు రోజులుగా పర్యటించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో 597 శిథిల భవనాలు ఉండగా, 354 చోట్ల చర్యలు తీసుకున్నది. 107 చోట్ల సంబంధిత భవనాలను కూల్చివేయగా, 109 వాటికి మరమ్మతులు జరిపారు. 135 చోట్ల ఇతర ప్రాంతాలకు బాధితులను తరలించారు. మూడు భవనాలను సీజ్ చేశారు. ఇక సెల్లార్ నిర్మాణాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. 181 ప్రాంతాలను గుర్తించి 140 చోట్ల చర్యలు తీసుకున్నారు. 41ప్రాంతాల్లో పనులు జరగకుండా నిలిపివేయించారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంకు ఫిర్యాదులు పోటెత్తాయి. ఆదివారం తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకు వివిధ సమస్యలపై 150కి పైగా ఫిర్యాదులొచ్చాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా చెరువులు నిండుకుండాలా మారాయి. కొన్ని చెరువులు నిండి మత్తడి పారుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది మిషన్ కాకతీయ ద్వారా చెరువుల అభివృద్ధి చేపట్టడం వల్ల చెరువు కట్టలు బలంగా మారి.. పూర్తిస్థాయిలో నిండినా..ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. జిల్లాలోని చెరువుల అభివృద్ధి, మరమ్మతులకు ఇప్పటి వరకు రూ. 40 కోట్ల నిధులను వెచ్చించారు. ఇదిలా ఉంటే రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయలు ఏర్పడుతుండటంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు విద్యుత్ సరఫరా లేదని ట్రాన్స్‌కో అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
వర్షాలకు నగరంలోని పలు చోట్ల చెట్టు నేలకూలి… విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. వాటిని సరిచేసుందకు విద్యుత్ సిబ్బంది గంటల సమయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. బంజారాహిల్స్ సర్కిల్ పరిధిలోని మధురానగర్, లక్ష్మీనగర్‌లో కురిసిన భారీ వర్షం,గాలుల ఉదృతికి నాలుగు పెద్ద చెట్లు వేర్లతో సహా విద్యుత్ స్తంభాలపై కూలిపోయాయి. దీంతో సుమారు 8 స్తంభాలు వంగిపోగా, మరికొన్ని విరిగిపోయాయి. దీంతో వాటికి ఉన్న కేబుళ్లు, విద్యుత్ తీగలు చెట్ల కొమ్మల్లో చిక్కుకొని ధ్వంసమయ్యాయి.
అయితే చెట్లు కూలిన చోట వాటి కొమ్మలు కొట్టి తొలగించేందుకు చాలా సమయం పట్టిందని, సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సరఫరా అందించాలనే ఉద్దేశంతో హుటాహుటిన ఏబీ కేబుల్స్ సమకూర్చుకొని, కూలిన చెట్ల కింద నుంచి ఏబీ కేబుల్స్‌తో కొత్త లైన్స్ వేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని తెలిపారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్ బీ బ్లాక్‌లో విద్యుత్ స్తంభాలు విరిగిపోయి గంటల తరబడి నిలిచిపోయిందని, సరఫరాను పునరుద్ధరించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుందని స్థానికులు వాపోయారు. అలాగే మధురానగర్ డీ బ్లాక్‌లో 28 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలకు చెట్లు నేల కూలడంతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిలిచిపోయిన సరఫరా సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పునరుద్ధ్దరించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. ఉస్మాన్‌సాగర్‌లోకి 3వేలు, హిమాయత్‌సాగర్‌లోకి 1500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నదని జలమండలి అధికారులు తెలిపారు. ఉస్మాన్‌సాగర్ గరిష్ఠ స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా..1785.10 అడుగులకు నీటి నిల్వలు ఉన్నాయి. హిమాయత్‌సాగర్ గరిష్ఠ స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు ఉంటే.. 1759.50 అడుగులకు నీటి నిల్వ ఉంది. ఉస్మాన్సాగర్ను జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ సోమవారం సందర్శించారు. ఆయన వెంట రంగారెడ్డి కలెక్టర్ శశాంక తదితరులు ఉన్నారు.
తాగునీటి సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ జలమండలి అధికారులకు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం సాయంత్రం మాసబ్‌ట్యాంక్‌లోని టీయూఎఫ్ఐడీసీ కార్యాలయంలో జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ ఇతర ఉన్నతాధికారులతో తాగునీటి సరఫరాపై సమావేశాన్ని నిర్వహించారు.