Rain Alert | సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరోపక్క కిందిస్థాయి గాలులు వాయువ్య, పశ్చిమ దిశల నుంచి తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్లో ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అధికంగా ఉండగా సాయంత్రానికి ఒక్కసారిగా నగర వాతావరణం చల్లబడుతోంది.
గురువారం నగరంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసాయి. సాయంత్రం 6గంటల వరకు కాప్రా పరిధిలోని చర్లపల్లి, మల్కారం ప్రాంతాల్లో 3మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు. కాగా గురువారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలు గాలిలో తేమ 35 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.