Rain Alert to IT Employees | హైదరాబాద్ : సాయంత్రం అయిందంటే చాలు నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొద్దంతా పొడి వాతావరణం ఉండి.. సాయంత్రం కాగానే హైదరాబాద్ నగర వ్యాప్తంగా మోస్తరు నుంచిభారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి. మంగళవారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఐటీ ఉద్యోగులకు లాగ్ ఔట్ వార్నింగ్ ఇచ్చారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు సాధ్యమైనంత వరకు తమ కార్యకలాపాలను మధ్యాహ్నం 3 గంటలకే లాగ్ఔట్ చేయాలని ఆదేశించారు. ఇక సాయంత్రం షిఫ్ట్ ఉద్యోగులు.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే బెటర్ అని సూచించారు. సాయంత్రం లోగా ప్రతి ఉద్యోగి తమ ఇండ్లకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలన్నారు సైబరాబాద్ పోలీసులు.
భారీ వర్షాలకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. మాదాపూర్, కొండాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలితో పాటు పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో రోడ్లపైనే ప్రయాణికులు, ఉద్యోగులు, వాహనదారులు గంటల తరబడి ఉండాల్సి వస్తుంది. కొన్ని చోట్ల అయితే వాహనాలు నీట మునిగి ముందుకు కదల్లేని పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఐటీ ఉద్యోగులు సహకరించాలని పోలీసులు కోరారు.