సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ ): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జీహెచ్ఎంసీ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ సిబ్బంది సంబంధిత ప్రాంతంలో వాలిపోయి సమస్యకు పరిష్కారం చూపుతున్నారు. వెయ్యి మంది సిబ్బందితో ప్రత్యేకంగా 334 మాన్సూన్ బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు జీహెచ్ఎంసీ గ్రీవెన్స్ సెల్‌కు నమోదైన సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా తోడేందుకు 139 స్టాటిక్ లేబర్ బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి.
ప్రత్యేకంగా 128 మినీ మొబైల్ బృందాలు వర్షాలకు దెబ్బతిన్న నాలాలు, రహదారుల మరమ్మతులను చేపడుతున్నారు. దీంతో పాటు గాలులకు పడిపోయిన చెట్లను కూడా వెంటనే తొలగించి, ట్రాఫిక్‌కు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకుగానూ 67 మొబైల్ అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయి. ఒక్కో బృందంలో నలుగురు చొప్పున షిఫ్టు పద్ధతిలో పని చేస్తూ… డీసీఎంలో గానీ ట్రాక్టర్లోగానీ తమకు కేటాయించిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు.
నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగర పౌరులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రెస్క్యూ బృందాలను నియమించి పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెల్లడించారు. సోమాజిగూడ డివిజన్లో వరద నీరు నిండిన పలు ప్రాంతాలను, నాలాల పరిస్థితులను స్థానిక కార్పొరేటర్ సంగీత, ఎస్ఈ రత్నాకర్, ఈఈ ఇందిరాభాయిలతో కలిసి మేయర్ గురువారం పరిశీలించారు. వాతావరణ శాఖ జారీ చేసిన సమాచారం ప్రకారం నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులు తమ పరిధిలోని క్షేత్రస్థాయిలో మాన్సూన్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు చెప్పారు.
చెరువుల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో నీటిని తోడి వేయడానికి మోటర్లను ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఎంఎస్ మక్తా, పార్క్ హోటల్ సమీపంలోని నాలాను పరిశీలించి మోటార్లతో నీళ్లు నిలిచిన ప్రదేశాలను క్లియర్ చేయాలని అధికారులకు మేయర్ ఆదేశాలు జారీ చేశారు. పార్క్ హోటల్ వద్ద జరుగుతున్న నాలా పనులను పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని మేయర్ ఆదేశించారు. వర్ష సంబంధిత సమస్యలుంటే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం 040-2111 1111 నంబర్‌కు ఫోన్ చేయాలని ఈ సందర్భంగా మేయర్ విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నగరంలో మరో రెండ్రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. భారీ వర్షాలతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని, వరద పరిస్థితులను ఎదుర్కొనే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇండ్ల నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులకు సీఎం స్పష్టం చేశారు. డ్రైనేజీ పరిస్థితుల మీద ఆరా తీసిన సీఎం.. తక్షణమే అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను మరోచోటకు తరలించి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్‌తో పాటు వివిధ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు.
సిటీబ్యూరో, జూలై 22(నమస్తే తెలంగాణ):వరుసగా కురుస్తున్న వర్షాలతో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. పోలీసు స్టేషన్లకు చెందిన ఎస్హెచ్ఓలో నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 70 లోతట్టు ప్రాంతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టాటా ఏరో స్పేస్ సంస్థ పోలీసు సిబ్బందికి రెండు బోట్లు, లైవ్ జాకెట్లను అందించిందన్నారు. ప్రత్యేక డిజాస్టర్ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. వర్షం కారణంగా ప్రజలు ప్రమాదంలో చిక్కుకుంటే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. బీబీనగర్ నుంచి జూలురు గ్రామానికి వెళ్లే మార్గం పై నీరు ప్రవహిస్తుండడంతో అక్కడ ఇబ్బందులు రాకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని సీపీ చెప్పారు. బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో లోతట్టు ప్రాంతంలో కొందరు స్థానికులు ఇరుకున్నారనే విషయం తెలియగానే ఇన్స్పెక్టర్, సిబ్బంది కొంత మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.