యాచారం, జూలై 31 : మండలంలోని మేడిపల్లిలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూముల్లో రేడియల్ సర్వే చేసేందుకు టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వేకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఫార్మా వ్యతిరేక పోరాట కమి టీ సభ్యులు కానమోని గణేశ్, సందీప్‌రెడ్డి, సామ నిరంజన్, మహిపాల్‌రెడ్డి, వినోద్‌కుమార్‌రెడ్డి, కుందారపు నారాయణ, బీఆర్ఎస్ నాయకుడు సాయికుమార్, సీపీఎం మండల కార్యదర్శి నర్సింహ, నానక్‌నగర్ మాజీ సర్పంచ్ పెద్దయ్య, మేడిపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి రైతులతో కలిసి అక్కడికి చేరుకున్నారు.
యాచారం తహసీల్దార్ ఆధ్వర్యంలో ఫార్మా భూములకు రేడియల్ (డిజిటల్) సర్వే చేసేందుకు అధికారులు వెళ్లగా ఫార్మా బాధిత రైతులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఇక్కడ సర్వే చేయాలని కోర్టు ఆర్డర్ ఉన్నదా అంటూ రైతులు అధికారులను ప్రశ్నించారు. దీంతో ఏసీపీ రాజు కల్పించుకొని అనవసరంగా గొడవలు వద్దని, అధికారులు మీ సందేహాలకు సమాధానమిస్తారని రైతులకు సర్ది చెప్పారు.
ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అక్కడికి చేరుకుని గతంలో సేకరించిన భూములకు ఇప్పటికే రైతులకు పరిహారంతోపాటు ఎకరాకు 121 గజాల చొప్పున ప్లాట్లు కూడా ఇచ్చామని.. గతంలో సేకరించిన భూముల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు రేడియల్ సర్వే చేస్తామని తెలిపారు. కోర్టు స్టే ఉన్న 2500 ఎకరాల భూముల జోలికి రావొద్దని రైతులు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. స్టే ఉన్న భూముల్లో ఎలాంటి హద్దురాళ్లు పాతినా వెంటనే తొలగిస్తామని హెచ్చరించారు. గతం లో అధికారులు, ప్రజాప్రతినిధులు పలుసార్లు వచ్చి తమకు న్యాయం చేస్తామని హామీచ్చినా నేటికీ నెరవేరలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఉన్న 2500 ఎకరాల భూమి జోలికి వెళ్లమని, అక్కడ ఎలాంటి హద్దురాళ్లు పాతమని ఆర్డీవో రైతులకు హామీ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి.
ఫార్మా బాధిత రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. కోర్టు స్టే ఉన్న భూముల్లో సర్వే చేయొద్దని, హద్దులను పాతొద్దన్నారు. రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, రైతుల పేర్లను ఆన్లైన్లో ఎక్కించి, రైతుభరోసాతోపాటు పంటరుణాలు అందేలా చూడాలని.. భూములను విక్రయించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరగా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్డీవో హామీ ఇవ్వడంతో బాధిత రైతులు శాంతించారు. అనంతరం రెండు బృందాలుగా విడిపోయిన అధికారులు గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో రేడియల్ సర్వే చేపట్టారు. సర్వే చేసిన భూములను 1000 గజాల చొప్పున విభజించారు. కాగా, ఆ భూములను పరిశ్రమలకు అప్పగించనున్నట్లు సమాచారం.
రేడియల్ సర్వేకు ఆటంకం ఏర్పడకుండా పోలీసులు గ్రామంలో పెద్ద మొత్తంలో మోహరించారు. ఏసీపీ రాజు, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ, యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి, మంచాల సీఐ మధు, ఎస్ఐలు వంశీ, ప్రియాంకలతోపాటు సుమారు 200 మంది పోలీసులు గ్రామంలో మోహరించారు.
ఫార్మాసిటీని రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బలవంతంగా రైతుల నుంచి భూములను లాక్కోవాలని చూడడం దారుణం. ఇది ప్రజా పాలనలా లేదు.. ప్రజలను పీడించే పాలనలా ఉన్నది. రైతులతో కలిసి పాదయాత్ర చేసిన నాయకులు పదవులు పొందగానే రైతులను విస్మరించడం సిగ్గుచేటు. రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫార్మాసిటీని రద్దు చేసి, ఆ భూములను తిరిగి రైతులకు ఇవ్వాలి. వారు అమ్ముకునేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మార్పులు చేయాలి.
-కుందారపు నారాయణ రైతు, కుర్మిద్ద
ఫార్మాసిటీకి ఇవ్వని 2500 ఎకరాల భూమి ఒకేచోట కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఉన్నది. ప్రభుత్వం తీసుకున్న భూమి మధ్యలో ఫార్మాకు ఇవ్వని పట్టా భూమి కూడా ఉన్నది. ఆ భూమికి దారిలేకుండా ఉండడంతో భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. ఫార్మాకు ఇవ్వని 2500 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకొని.. ఆ భూమికి బదులుగా మరోచోట 2500 ఎకరాలు ఒకే చోట ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న బోర్లు, పశువుల కొట్టాలు, చెట్లకు ఖరీదు చెల్లించాలి. లేదంటే 2500 ఎకరాల భూములు ఎక్కడ ఉన్నా ప్రభుత్వమే దారి చూపెట్టాలి.
-సందీప్‌రెడ్డి రైతు, మేడిపల్లి
కోర్టు స్టే ఉన్న భూముల జోలికి వస్తే ఊరుకోం. ఫార్మాసిటీకి ఇవ్వని 2500 ఎకరాల భూములను మినహాయించి మిగతాది ఏమైనా చేసుకోండి. స్టే ఉన్న భూముల్లో సర్వే చేస్తే అధికారులను అడ్డుకుంటాం. ప్లాట్ల పేరుతో మభ్యపెట్టి రైతుల భూములను బలవంతంగా లాక్కోవాలని అధికారులు చూస్తున్నారు.
-కానమోని గణేశ్, ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు, మేడిపల్లి
ఫార్మాసిటీకి ఇవ్వని భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. ఆ భూములను ఆన్లైన్లో రైతుల పేరున మార్చడంతోపాటు అమ్ముకునేందుకు వీలు కల్పించాలి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి.. పవర్లోకి వచ్చి ఇప్పుడు తమ సమస్యలను పట్టించుకోవడంలేదు.
-వినోద్‌కుమార్‌రెడ్డి రైతు, కుర్మిద్ద