సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ):నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మహిళలను వేధించే ఆకతాయిలను పట్టుకోవడం, వేధింపులను కట్టడి చేసేందుకు షీ టీమ్స్ సిబ్బంది వేగంగా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో షీ టీమ్స్‌కు లాప్టాప్స్, పెన్ కెమెరాలు, ప్రొజెక్టర్లు, ప్రింటర్స్, సెల్‌ఫోన్స్ తదితర సాంకేతిక పరికరాలను అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఆకతాయిల వేధింపులను నియంత్రించడం, ప్రజలల్లో అవగాహన కల్పించేందుకు షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. మహిళల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, నూతన సాంకేతిక పరికరాలతో మరింత సమర్దవంతంగా పని చేయాలని సీపీ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషావిశ్వనాథ్, ఇన్స్పెక్టర్లు ముని, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.