బడంగ్‌పేట, మార్చి11:సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ఆదేశించారు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఆయన సందర్శించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలపై పోలీసు అధికారులతో సమీక్షించారు. స్టేషన్ పరిసరాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. సిబ్బంది పని విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
విధి నిర్వహణలో ఉపయోగపడే పలు రకాల మెలకువలను సిబ్బందికి తెలిపారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించడంతో పాటు రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ వంటి పలు విభాగాల పనితీరుపై ఆరా తీశారు. సీసీ టీవీల నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి.. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ సునీతా రెడ్డి, ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి, ఇన్స్పెక్టర్ గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు.