సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం అంబర్‌పేట్‌లోని రాచకొండ కార్ హెడ్‌క్వార్టర్స్‌లో కమిషనరేట్ పోలీసు అధికారులతో కలిసి అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తీవ్రవాదుల చేతుల్లో అమరులైన 16 మంది రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా సత్కరించారు. ఆయా కుటుంబాలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం అమరు వీరు జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు పోలీసులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు పద్మజా, అనురాధ, సునీతారెడ్డి, అరవింద్ బాబు, ఇందిరా, ఉషారాణి, శ్రీనివాస్, మనోహర్, నాగలక్ష్మి, శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.