సిటీబ్యూరో, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): గణేష్ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. నాచారం ఐఐసీటీలో డీసీపీలు, ఏసీపీలు, ఆయా జిల్లాల నుంచి వచ్చిన అధికారులతో సీపీ సమన్వయ సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ గణేష్ విగ్రహాల నిమజ్జనం విషయంలో నిర్వాహకులతో స్థానిక ఇన్స్పెక్టర్లు సమన్వం చేసుకోవాలన్నారు. శాంతి భధ్రతలకు ఎక్కడా విఘాతం కల్గకుండా అందరు సమష్టిగా కృషి చేయాలన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాలలోని చెరువులు, కుంటల వద్ద ట్రాఫిక్ అంతారయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ, ఇరిగేషన్, విద్యుత్, రవాణా తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ గణేష్ నిమజ్జనం సజావుగా సాగేలా చూడాలన్నారు. సీసీటీవీల ద్వారా నిమజ్జనం సాగే రూట్లలో ట్రాఫిక్‌ను, నిమజ్జనం జరిగే చోట పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. విజబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంటుందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు రాజేష్ చంద్ర, అభిషేక్ మహంతి, శ్రీనివాస్, సాయిశ్రీ, అనూరాధ, ఉషా విశ్వనాథ్, శ్రీబాల, మురళీధర్, గిరిధర్, బాలస్వామి, ఇందిర తదితర అధికారులు పాల్గొన్నారు.