కాచిగూడ,అక్టోబర్ 23 : బీసీల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 26వ తేదీన వేలాది మంది బీసీలతో పార్లమెంట్‌ను(Parliament) ముట్టడిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య(R.Krishnaiah) కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీలకు సామాజిక న్యాయం చేయకపోతే కేంద్రంపై మిలిటెంట్ పోరాటం చేస్తామని ప్రకటించారు. జాతీయ బీసీ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో 13 బీసీ సంఘాలు, 30 కుల సంఘాల నాయకులతో బధవారం కాచిగూడ అభినందన్ హోటల్లో సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిధిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ.. పార్లమెంట్లో బీసీ బిల్లు(BC bill) పెట్టి, జనగణలో కులగణన చేయాలని డిమాండ్ చేశారు.
ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలాగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. కేంద్రం జనాభా దమాషా ప్రకారం బీసీలకు రిజర్వేన్లు కల్పించాలని, అందుకు పార్లమెంట్లో రాజ్యంగ సవరణ చేయాలన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వికసిత్ భారత్ అంటే అంబాని, అదాని కాదని, దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలైన బహుజనులను బాగుచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నంద గోపాల్, ఉదయ్,నీల వెంకటేశ్, రాఘవ, రఘుపతి, మోడి రాందేవ్, రవియాదవ్, నిఖిల్, దేవేందర్, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.