మెహిదీపట్నం, అక్టోబర్ 22: విద్యార్థులకు ఫీజు బకాయిలు నాలుగు వేల కోట్లు చెల్లించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కిటకిటలాడుతుందని, మూసీ సుందరీకరణకు లక్షా 50 వేల కోట్లను కేటాయించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మాజీ ఎంపీ, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్,కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులతో ఫీజు బకాయిలు చెల్లించాలంటూ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ నేతృత్వంలో మెహిదీపట్నంలో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవడం సమంజసం కాదని హెచ్చరించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ మాట్లాడుతూ ఫీజు బకాయిలు చెల్లించకుంటే రాహుల్‌గాంధీ ఇంటిని ముట్టడిస్తామని తీవ్రంగా హెచ్చరించారు.