సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): నగరంలోని పలు ప్రాంతా ల్లో భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం వేళలో వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమై ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తింది. ఆఫీస్ కార్యకలాపాలు ముగించుకొని ఇండ్లకు తిరిగి వెళ్లే సమయం కావడంతో చాలా చోట్ల నగర వాసులు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. రహదారులు జలమయమైన చోట వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగాయి. పంజాగుట్ట, బేగంపేట, కూకట్పల్లి, మూసాపేట, నిజాంపేట, హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్, నాంపల్లి, కోఠి ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచింది. దీంతో కోర్ సిటీలో ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం అత్యధికంగా నార్త్ హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో 5.3 సెం.మీ, కూకట్‌పల్లిలో 5.1, శంషీగూడలో 4.7, సికింద్రాబాద్ పాటిగడ్డలో 4.6, బన్సీలాల్‌పేటలో 4.1, గోల్కొండలో 3.7 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా షేక్‌పేట, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో 2.6 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
భారీ వర్షానికి ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ ఐకియా, మైండ్ స్పేస్ జంక్షన్, సైబర్ టవర్స్ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సరిగ్గా ఐటీ ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయంలో ఐటీ కారిడార్‌లోని రోడ్లన్నీ వాహనాలతో నిండిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నగరంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. సికింద్రాబాద్ ప్రాంతంలోని శివ అరుణ్ కాలనీలో 3గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ప్రీతి తాలపల్లి ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. ఇలా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, గాజుల రామారం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా గంటల తరబడి నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో గడపాల్సి వచ్చింది.