మండల పరిధిలో 39 పాఠశాలలు ఎంపిక
171 ప్రాథమిక, 134 ఉన్నత పాఠశాలల టీచర్లకు శిక్షణా తరగతులు
సైదాబాద్, ఏప్రిల్ 12 : రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కార్ పాఠశాల్లో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించాలని ప్రకటించిన నేపథ్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను కొనసాగిస్తున్నారు. విద్యాశాఖ నిపుణులైన అధికారులు ఉపాధ్యాయులకు శిక్షణనిస్తూ సన్నద్ధమౌతున్నారు. ఇప్పటికే మండల పరిధిలోని (ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కోర్స్ – ఈఎల్‌ఈసీ) పేరిట శిక్షణాతరగతులను నిర్వహిస్తున్నారు. తొమ్మిది వారాలపాటు కొనసాగుతున్న శిక్షణాతరగతుల్లో మొదటి విడుత పూర్తికావటంతో, రెండో విడుత శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి.
ఉపాధ్యాయులకు శిక్షణాతరగతులు..
ఎంపిక పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణాతరగతులను నిర్వహిస్తున్నారు. గణితం, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లో ఆంగ్లభాష నిపుణులచేత శిక్షణ ఇప్పిస్తున్నారు. సైదాబాద్, హిమయత్‌నగర్, అంబర్ పేట మండలాలకు చెందిన ఉపాధ్యాయులందరికీ ఆంగ్ల బోధనపై 9 వారాల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తుండగా, రెండువారాలు ఫిజికల్ ట్రైనింగ్ ఉండగా మరో 7 వారాలపాటు ఆన్లైన్లో శిక్షణనిస్తున్నారు. మొదటి విడుతలో 24 మంది ఉన్నతపాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, 22 మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ పొందారు. రెండో విడుతలో భాగంగా 147మంది ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, 100మంది ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. మండల పరిధిలో మొత్తంగా 39 ప్రభుత్వ పాఠశాలలుండగా అందులో 11 ప్రాథమిక, 28 ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 7,500 విద్యార్ధులు ఆంగ్ల మాధ్యమంలో చదువుకోనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమవిద్య ..
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కార్ పాఠశాలల్లో విద్యాబోధన కొనసాగించనున్నాం. అన్ని టెక్నిక్స్ ఉపాధ్యాయులకు శిక్షణాతరగతుల్లో నేర్పించాం. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించటానికి తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్లబోధన ప్రవేశపెట్టడంతో ఉత్తమ విద్యను అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం
– ఎం. విజయలక్ష్మి సైదాబాద్ మండల ఉప విద్యాశాఖ అధికారి